లాహోర్: గత కొన్నేళ్లుగా తమతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి విముఖత వ్యక్తం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు తగిన పరిహారం చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరోసారి రచ్చకెక్కింది. ఇందులో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తమ క్రికెట్ కు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందేనని పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ డిమాండ్ చేస్తున్నారు.
2015-23 మధ్య కాలంలో భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా ఆయా క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం జరిగింది. అయితే పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశంతో క్రికెట్ కు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ తమ ఉగ్ర చర్యలకు ఫుల్ స్టాప్ పెడుతుందో అప్పుడే వారితో ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరు జట్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం ఆ రెండు ప్రభుత్వాల అంగీకారంపై ఆధారపడటంతో దానికి ఎటువంటి ముందడుగు పడటం లేదు. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా జోక్యం చేసుకోవడం లేదు. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ కావడంతో ఆయా క్రికెట్ బోర్డులే తేల్చుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు.
'ఇరు బోర్డుల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి 2014 లో ఒప్పందం కుదిరింది. తొలి సిరీస్ పాక్ లో జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ తో ఆడేందుకు భారత్ కు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ద్వైపాక్షిక సిరీస్ అంటే బీసీసీఐ ఎందుకు వెనకడుగు వేస్తోంది. తటస్థ వేదికలు దుబాయ్, శ్రీలంకల్లో సిరీస్ లు నిర్వహిస్తామన్న భారత్ ఆసక్తి చూపడం లేదు. గతేడాది లంకలో సిరీస్ జరిపేందుకు ముందుకొస్తే బీసీసీఐ అందుకు ముందుకు రాలేదు. మా క్రికెట్ కు జరిగిన నష్టానికి 70 మిలియన్ డాలర్లను బీసీసీఐ చెల్లించాల్సిందే'అని నజామ్ సేథీ డిమాండ్ చేశారు.