పాక్-విండీస్ మ్యాచ్ (ఫైల్)
కరాచీ: పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ వెనుకడుగు వేసింది. తమ దేశంలో ఆడేందుకు విండీస్ నిరాకరించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరాశ చెందింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న వెస్టిండీస్ టీమ్ సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్థాన్ తో యూఏఈలో సిరీస్ ఆడేందుకు అంగీకరించింది. అయితే సిరీస్ భాగంగా కొన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్ లు తమ దేశంలో ఆడాలని విండీస్ ను పీసీబీ కోరింది. అయితే భద్రతా కారణాలతో పాకిస్థాన్ లో ఆడేందుకు విండీస్ ఒప్పుకోలేదు.
ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు నుంచి తమకు వర్తమానం అందిందని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విండీస్ నిర్ణయం తమకు తీవ్రనిరాశ కలిగించిందన్నారు. యూఏఈలో జరగనున్న సిరీస్ లో పాక్-విండీస్ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి. 2009, మార్చిలో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్ లో తీవ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు క్రికెట్ దేశాలు జంకుతున్నాయి.