పీటర్సన్ కు తీరిన వీసా సమస్య
గత పది రోజులుగా నలుగుతున్న తన వీసా సమస్యను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ట్విట్టర్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కరించుకున్నాడు. విషయంలోకి వెళితే... ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ కోసం ఈనెల చివరిలో కేపీ భారత్‌కు రావాల్సి ఉంది.
వీసా మంజూరు కోసం ఇంగ్లండ్‌లో ఉన్న భారత హైకమిషనర్ కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాడు. అయితే పది రోజులైనా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విసిగిపోయిన కేపీ తన ఆవేదనను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘అర్జెంట్‌గా భారత్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ భారత ఎంబసీ దగ్గర పది రోజులుగా నా పాస్‌పోర్ట్ ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి’ అని దౌత్యాధికారులను కోరుతూ ట్వీట్ చేశాడు.
ఈ కామెంట్స్‌కు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందిస్తూ క్రీడా శాఖ నుంచి ఆ ఈవెంట్‌కు అనుమతి పొందాల్సి ఉందని కేపీకి ట్వీట్ చేశారు. ఆ తర్వాత క్రీడా శాఖ తప్పనిసరి అనుమతి ఇచ్చినట్టు ఆయన మరో ట్వీట్ చేశారు. దీనికి ఎగిరి గంతేసిన పీటర్సన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘శుభవార్త. ట్విప్లోమసీ (ట్వీట్+డిప్లొమసీ) బాగానే పనిచేసింది. క్రీడా శాఖ నుంచి తప్పనిసరి అనుమతి లభించింది. వీసా త్వరలోనే మంజూరవుతుంది. భారత్‌లో కలుద్దాం’ అని అన్నాడు.