ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసు నుంచి ఫిల్ సిమ్మన్స్ తప్పుకొన్నట్లు సమాచారం. టీమిండియా కోచ్ ఎంపికకు శుక్రవారం ఇంటర్వ్యూలు మొదలైన విషయం తెలిసిందే. ఈ పదవికై ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాబిన్ సింగ్ ఇంటర్వ్యూ ముగిసినట్లు సమాచారం. ఇక వ్యక్తిగత కారణాలతో ఫిల్ సిమ్మన్స్ ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిసింది. దీంతో కోచ్ రేసులో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు. కాగా ఫిల్ సిమ్మన్స్ వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లకు కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంటర్వ్యూ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాననున్నట్లు సమాచారం. కెప్టెన్ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం... అతడి శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకోవడం, పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్‌కు మంచి సంబంధాలు ఉండటంతో రవిశాస్త్రి ఎంపిక లాంఛనమే కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటర్వ్యూలు ముగియనున్నట్లు సమాచారం. అయితే సిమ్మన్స్ ఉపసంహరించుకోవడంతో ఆరు గంటలకే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌గా ఎంపికైన వారు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ దక్కించుకోనున్నారు. టీ20 ప్రపంచ కప్ 2021 వరకు వీరు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment