న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో కుక్కలు పరుగెత్తి రావడం వల్లనో, తేనెటీగలు, ఇతర కీటకాల దాడి వల్లనో మ్యాచ్‌లు ఆగిపోవడం ఎన్నో సార్లు చూశాం! కానీ శుక్రవారం మాత్రం గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇక్కడి పాలమ్ ఎయిర్‌ఫోర్స్ క్రికెట్ గ్రౌండ్‌లో చోటు చేసుకుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆగంతకుడు మారుతి వేగన్‌ఆర్ కారుతో మైదానంలోకి దూసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా పిచ్‌పైకే వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది వచ్చి ఆపేలోపే రెండు సార్లు పిచ్‌పైనే అడ్డదిడ్డంగా కారును నడిపించాడు. మ్యాచ్ మూడో రోజు ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా జరిగిన ఈ ఘటనతో ఇరు జట్ల సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, రిషభ్ పంత్ తదితరులు ఆడుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్‌లోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే మెయిన్ గేటు మూసివేసిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు.
మతిస్థిమితం లేకనే...
తాజా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విచారణకు ఆదేశించారు. ‘అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు. లోపలికి వచ్చిన వ్యక్తి ఉద్దేశాలు వేరుగా ఉంటే అంతర్జాతీయ క్రికెటర్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. మైదానానికి బాధ్యత వహించాల్సిన సర్వీసెస్ బోర్డుతో దీనిపై మాట్లాడతాం’ అని ఖన్నా చెప్పారు. మరోవైపు పోలీసులు తమ విచారణలో 30 ఏళ్ల గిరీశ్ అనే ఆ వ్యక్తిని మానసిక రోగిగా తేల్చారు. ‘ఆ సమయంలో అతడిని చూస్తుంటేనే అదో రకంగా అనిపించింది. లుంగీ వేసుకొని అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేశాడు. బయటికి తీసుకొచ్చి చావబాదుతున్నా కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదు. అతని మానసిక స్థితి సరిగా లేదని అప్పుడే అర్థమయ్యింది’ అని మ్యాచ్‌కు ప్రత్యక్ష సాక్షి అయిన ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు.
స్ట్రెయిట్ డ్రైవ్... కవర్ డ్రైవ్... కార్ డ్రైవ్...
Published Sat, Nov 4 2017 12:43 AM | Last Updated on Sat, Nov 4 2017 12:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment