వాటివల్లే ఈ స్థాయికి వచ్చా: ఏబీ
బెంగళూరు: జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అనే సామెత మనకు సుపరిచతమే. దీన్ని కొద్దిగా మార్చి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ..బట్ మాస్టర్ ఆఫ్ వన్ అంటే అది దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కు అతికినట్లు సరిపోతుంది. ఎన్నో ఆటల్లో ప్రావీణ్యం సంపాదించిన ఏబీ.. చివరకు క్రికెట్ లో మాత్రం విశేషంగా రాణిస్తూ గొప్ప క్రీడాకారుడిగా అవతరించాడు. ఇదే విషయాన్ని ఏబీ కూడా ఒప్పుకున్నాడు. తాను క్రికెటర్ గా ఈ స్థాయికి రావడానికి తాను పలు ఆటల్లో ఉన్న నైపుణ్యమే కారణమని స్పష్టం చేశాడు.
శనివారం బెంగళూరులో టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్ ద్వారా 100 వ టెస్టును పూర్తి చేసుకోబోతున్న ఏబీ మాట్లాడుతూ.. తనకు రగ్బీ, ఫుట్ బాల్, హాకీ, బ్యాడ్మింటన్ ఇలా పలు క్రీడల్లో ఆడిన అనుభవం ఉందన్నాడు. అవే తనను క్రికెటర్ గా ఇంత స్థాయికి తెచ్చినట్లు పేర్కొన్నాడు. ఒక క్రికెటర్ గా రూపాంతరం చెందడానికి ఆ క్రీడలు ఉపకరించినట్లు ఏబీ పేర్కొన్నాడు. క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చిన తాను.. ఇద్దరు అన్నలతో కలిసి అనేక గేమ్ లు ఆడానన్నాడు. ఇలా అనేక రకాల గేమ్స్ ఆడినా తన తల్లిదండ్రులు ఏ రోజు కూడా వద్దని అడ్డుచెప్పలేదన్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్న వారు ప్రోత్సహించేవారన్నాడు.