ఇది లంక కాదు
న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన రెండు జట్లు మొనరగల హార్నెట్స్, వెల్లవాయ వైపర్స్... ఇరు జట్ల మధ్య టి20 లీగ్ మ్యాచ్. పలు సోషల్ మీడియా సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం కూడా. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లో స్కోరు కార్డు. వేదిక శ్రీలంకలోని బదుల్లా పట్టణం. కామెంటేటర్ కూడా ‘ఇక్కడ బదుల్లాలో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది, వాతావరణం బాగుంది’ అంటూ వ్యాఖ్యానం. పైగా అక్కడక్కడా శ్రీలంక ప్రముఖ మొబైల్ కంపెనీ డైలాగ్‌కు చెందిన బ్యానర్లు కూడా... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వుంది. ఈ మ్యాచ్ జరిగింది లంకలో కాదు. భారత్‌లోనే... చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిపై ఉన్న సవారా గ్రామంలో మ్యాచ్ నిర్వహించారు. యువా టి20 లీగ్ పేరుతో ఈ టోర్నీ జరుగుతున్నట్లు కొందరు చెప్పారు. కానీ కరోనా కట్టుబాట్ల నేపథ్యంలో ఒక మ్యాచ్ ఎలా సాధ్యమంటూ వివరాల్లోకి వెళితే ఇది బయటపడింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసమే ఇలాంటి మ్యాచ్ ఆడించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆడింది అంతా పంజాబ్ కుర్రాళ్లే. శ్రీలంకలో గుర్తింపు పొందిన క్లబ్ యువా పేరు వాడుకొని కొందరు తెలివిగా ఇలా చేసినట్లు తెలిసింది. లంక బోర్డు తమకు టోర్నీ నిర్వహణ కోసం అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లు చూపించడంతో ప్రత్యక్ష ప్రసారానికి ‘ఫ్యాన్‌కోడ్’ అనే సైట్ ముందుకు వచ్చింది. దీనిపై ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కాబట్టి తాము ఎలాంటి చర్య తీసుకోలేమని బీసీసీఐ స్పష్టం చేయగా... శ్రీలంక కూడా తమకు, ఈ టోర్నీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ప్రత్యక్ష ప్రసారం చేసిన ‘ఫ్యాన్ కోడ్’ మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ కాగా...వారికి చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి. దీనికి ధోని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment