న్యూఢిల్లీ: జాతీయ క్రీడ హాకీకి పట్టిన అధోగతిపై సుప్రీంకోర్టు మండిపడింది. గతంలో ఘనంగా వెలిగిన ఈ క్రీడ... రాజకీయాలతో నానాటికీ తీసికట్టుగా తయారైందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య పాలకుల వల్లే ఆట భ్రష్టు పట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. క్రీడా సమాఖ్యలు, సంఘాలకు నేతృత్వం వహించాల్సింది క్రీడాకారులే తప్ప వ్యాపారవేత్తలు కాదని స్పష్టం చేసింది.
అధికారిక గుర్తింపు కోసం భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్), హాకీ ఇండియా (హెచ్‌ఐ)ల మధ్య వైరం నడుస్తుండటంతో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ టీఎస్ ఠాకూర్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. రెండేళ్ల క్రితం ఇరు సంఘాలు పరస్పరం ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఒలింపిక్స్‌లో హాకీకి 8 స్వర్ణాలు గెలిచిన ఘనచరిత్ర ఉంది. అలాంటి జట్టు లండన్ ఒలింపిక్స్ (2012)లో అట్టడుగు 12వ స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ హాకీ (2010)లో ఎని మిదో స్థానానికి పరిమితమైంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలతో సమాఖ్య వర్గాలను తలంటింది. చెత్త రాజకీయాలు, అధిపత్య ధోరణి వల్ల అంతిమంగా ఆటే బలిపశువవుతోందని, ఆటగాళ్లు నష్టపోతున్నారని పేర్కొంది. వ్యాపారవేత్తలు, క్రీడేతర వ్యక్తులు అధ్యక్షులు అవడం వల్ల వాళ్లు దీన్నో ప్రైవేటు వ్యవహారంగా చూసుకుంటున్నారు తప్ప క్రీడలపై చిత్తశుద్దితో కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
రాజకీయాలతో హాకీ అధోగతి: సుప్రీం కోర్టు
Published Fri, Dec 6 2013 1:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement