టైటిల్ పోరుకు ప్రణయ్
పాలెమ్‌బాంగ్: భారత యువ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ వరుసగా రెండో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 21-14, 14-21, 21-14తో తొమ్మిదో సీడ్ డారెన్ లూ (మలేసియా)పై విజయం సాధించాడు. గతవారం జరిగిన వియత్నాం ఓపెన్‌లో ప్రణయ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. డారెన్‌తో దాదాపు గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో 5-8తో వెనుకబడ్డా 12-12తో స్కోరును సమం చేసి ముందుకు దూసుకెళ్లాడు. అయితే రెండో గేమ్ ఆరంభంలో 7-3 ఆధిక్యంలో ఉన్న ప్రణయ్‌ను మలేసియా ఆటగాడు కట్టడి చేయడంతో పుంజుకోలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ 5-0, 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. డారెన్ ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రణయ్... అబ్దుల్ కోలిక్ (ఇండోనేసియా)తో తలపడతాడు.