వీరేంద్ర సెహ్వాగ్,ప్రీతి జింటా
ముంబై: రాజస్తాన్ రాయల్స్ చేతిలో మంగళవారం ఎదురైన పరాజయం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీలో విభేదాలకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. దీంతో జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యూహాలను ఫ్రాంచైజీ యజమాని ప్రీతి జింటా ప్రశ్నించింది. హిట్టర్లను కాదని కెప్టెన్ అశ్విన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఏమిటంటూ ఆమె అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ జట్టు కూర్పు విషయమై ఇద్దరి మధ్యా విభేదాలు రావడం, ప్రీతి వైఖరితో నొచ్చుకున్న వీరూ... బాధ్యతల నుంచి తప్పుకొంటానంటూ ఫ్రాంచైజీ ఇతర యజమానులకు చెప్పినట్లు సమాచారం. కానీ, దీనిపై సెహ్వాగ్ నుంచి ఇంతవరకు ఎలాంటి వివరణ రాలేదు.
జట్టు ప్లే ఆఫ్‌కు చేరువగా ఉన్న ఈ దశలో వివాదాల కారణంగా ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకూడదనే అతడు మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. మరోవైపు వారిద్దరి మధ్య సంభాషణ... ప్రతి మ్యాచ్ అనంతరం జరిగే చర్చలాంటిదేనని, ఫలితం పట్ల ప్రీతి నిరాశ చెందారని కొందరు పేర్కొంటున్నారు. తాను వారిద్దరితో మాట్లాడానని, సమస్యేమీ లేదని సహ యజమాని మోహిత్ బర్మన్ చెబుతున్నారు. ప్రీతి కూడా వివాదం జరుగలేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment