పుల్లెల గోపీచంద్
ఆటలంటే ఇష్టంలేని పిల్లలు ఎవరూ ఉండరు. ఎవరైనా తొలుత సరదా కోసమే ఆడతారు. అంతే గానీ ప్రపంచ చాంపియన్ కావాలనే కోరికతో అడుగుపెట్టరు. ఇలాంటి వారి నుంచి చాంపియన్లు వస్తారు. అయితే పిల్లాడి ఇష్టాయిష్టాలతో పాటు తల్లిదండ్రులు, కోచ్ కీలకం. పిల్లలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా చాలామంది గెలవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు.
అతడు పడుతున్న కష్టాన్ని విస్మరిస్తారు. ఇది చాలా తప్పు. కష్టపడమని వెంటపడొచ్చుగానీ... నైరాశ్యంలో వెళ్లే స్థాయిలో ఒత్తిడి పెంచకూడదు. ఓడిపోయినా కష్టపడ్డప్పుడు అభినందించాలి. సమతుల్యత పాటిస్తేనే ఈతరం పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. కోచ్‌గా చాలాకాలంగా అనేక విషయాలు పరిశీలించాను. సాధారణంగా కుర్రాళ్లలో కొంత మంది ఒక్క మాటలో చెబితే వినేస్తారు. మరొకరికి గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఇంకొందరికి సుదీర్ఘ ప్రసంగం ఇస్తే గానీ అర్థం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే చక్కటి ప్రతిభ వృథా అయ్యే ప్రమాదం ఉంది.
అండర్-14 లేదా అండర్-16 కేటగిరీలలో మంచి విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లు ఆ తర్వాత వెనుకబడిపోతున్నారు. సీనియర్ స్థాయిలో గెలవడం తన వల్ల కాదేమోననే భయం వారిలో పెరుగుతోంది. పెద్ద ఆటగాళ్లతో పోటీ పడాలన్న పట్టుదల, చిన్న ఆటగాళ్లను గౌరవించే వారికే విజయాలు దక్కుతాయి. గెలిస్తే నా అంతటోడు లేడని తలెగరేసే వాళ్లు, ఓడితే కుంగిపోయే వాళ్లు కెరీర్‌లో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్రీడాకారుడిగా ఎదగడంలో ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి దేశానికి ఆడిన తర్వాత కలిగే గర్వానికి ఏదీ సాటిరాదు. ఎప్పుడూ సాధారణ చదువులకన్నా, కొంత మందైనా తమ పిల్లలను ఆటగాళ్లుగా మార్చాలని భావిస్తే భారత్‌లో క్రీడలకు ఉండే విలువ ఎప్పటికీ తగ్గదు.
ఒత్తిడి పెంచకూడదు
Published Thu, Aug 29 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement