అరంగేట్రంలోనే అదుర్స్
రాజ్కోట్:తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్లో గెలిచిన ముంబై జట్టు మరోసారి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. తమిళనాడు విసిరిన 251 లక్ష్యాన్ని ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి 62.1 ఓవర్లలో ఛేదించింది. ముంబై ఓపెనర్ పృథ్వీ షా(120;175 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) శతకం చేయడంతో ముంబై జట్టు సునాయాసంగా గెలిచింది. ఇది పృథ్వీ షాకు అరంగేట్రం మ్యాచ్ కావడం విశేషం. ముంబై తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన షా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం శతకంతో మెరిశాడు. అరంగేట్రం మ్యాచ్లోనే అదుర్స్ అనిపించి దిగ్గజాల సరసన 17 ఏళ్ల షా నిలిచాడు. ముంబై తరపున అరంగేట్రంలోనే సెంచరీలు సాధించిన 11వ ఆటగాడిగా షా గుర్తింపు సాధించాడు.
ఈ రోజు ఆటలో రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన షా ఆద్యంతం ఆకట్టుకున్నాడు.తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, రెండో వికెట్కు మరో 91 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో ముంబై సునాయాసంగా విజయం సాధించింది. ఇదిలా ఉంచితే, ముంబై జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరగా, ఓవరాల్గా 46సార్లు తుది బెర్తును ఖాయం చేసుకోవడం ఇక్కడ విశేషం. జనవరి 10వ తేదీ నుంచి జరిగే ఫైనల్లో గుజరాత్తో ముంబై తలపడనుంది.