తెలుగు టైటాన్స్‌ ఆరో‘సారీ’ | Pro-Kabaddi League defeated the Telugu Titans by six times | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ ఆరో‘సారీ’

Published Sun, Aug 13 2017 1:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

తెలుగు టైటాన్స్‌ ఆరో‘సారీ’

తెలుగు టైటాన్స్‌ ఆరో‘సారీ’

యూపీ యోధ చేతిలో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్‌  

అహ్మదాబాద్‌:  ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన పోరులో టైటాన్స్‌ 32–39 పాయింట్ల తేడాతో యూపీ యోధ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి (12 పాయింట్లు) అద్భుతంగా రాణించినప్పటికీ సహచరుల తోడ్పాటు లేక జట్టు కంగుతింది.

ఆరంభంలో స్వల్ప ఆధిక్యంలో నిలిచినా... మ్యాచ్‌ జరిగే కొద్దీ తేలిపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్‌ 13–14తో వెనుకబడింది. ఇక ద్వితీయార్ధంలో నితిన్‌ తోమర్‌ (10 పాయింట్లు) యూపీ జట్టుకు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిపెట్టాడు. రిషాంక్‌ 6 పాయింట్లు చేశాడు. టాకిల్‌లో రాజేశ్‌ నర్వాల్‌ (4) ఆకట్టుకున్నాడు. టైటాన్స్‌ తరఫున డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ టాకిల్‌లో 4 పాయింట్లు చేశాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి.

అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 29–25తో దబంగ్‌ ఢిల్లీని ఓడించింది. గుజరాత్‌ జట్టులో సచిన్‌ 8, సునీల్‌ కుమార్‌ 3 పాయింట్లు చేశారు. ఢిల్లీ జట్టులో మెరాజ్‌ షేక్‌ 8, రవి దలాల్‌ 2 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌–2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement