దులీప్ ట్రోఫీ చాంప్ ఇండియా బ్లూ
ఫైనల్లో రెడ్‌పై355 పరుగుల విజయం
మ్యాచ్‌లో జడేజాకు పది వికెట్లు
గ్రేటర్ నోయిడా: రవీంద్ర జడేజా (5/95, 5/76) స్పిన్ మాయాజాలంతో దులీప్ ట్రోఫీ తొలి డేనైట్ టోర్నీలో ఇండియా బ్లూ విజేతగా నిలిచింది. ఇక్కడి స్పోర్‌ట్స కాంప్లెక్స్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో బ్లూ జట్టు 355 పరుగుల భారీ తేడాతో ఇండియా రెడ్‌పై ఘనవిజయం సాధించింది. జడేజా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 10 వికెట్లు తీయడం ఇది ఆరోసారి.
చివరి రోజు ఇండియా బ్లూ 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. కుల్దీప్‌కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం 337 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు 517 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా రెడ్ రెండో ఇన్నింగ్‌సలో 161 పరుగులకే ఆలౌటైంది. ధావన్ 29, యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్‌సలో ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగులకు డిక్లేర్ చేయగా... రెడ్ జట్టు 356 పరుగులకు ఆలౌయింది.