జడేజా ఆల్ రౌండ్ షో.. భారత్ పైచేయి
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు భారత్ పైచేయి సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 360/6తో స్టార్ట్ చేసిన భారత్.. ఓ వైపు బ్యాటింగ్ లో ఆదివారం 3 వికెట్లు కోల్పోయి 243 అదనపు పరుగులు స్కోరు బోర్డుకు జతచేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఆసీస్ పతనాన్ని జడేజా ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ బ్యాట్స్ మన్లకు పరీక్ష పెట్టాడు.
బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా(55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆపై బౌలింగ్ లో రెండు వికెట్లు తీశాడు. ఆట నిలిపివేసే సమయానికి ఆసీస్ 7.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 23 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ (14), నైట్ వాచ్ మెన్ నాథన్ లియోన్ (2)లను భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించాడు. భారత్ ఇంకా 129 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పుజారా డబుల్ 'వంద'నం.. సాహా సెంచరీ
ఓవర్ నైట్ స్కోరు 130తో ఉన్న చతేశ్వర్ పుజారా నాలుగో రోజు ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆసీస్ పై రెండో డబుల్ సెంచరీని సాధించాడు. అనంతరం పుజారా(525 బంతుల్లో 202; 21 ఫోర్లు) ఏడో వికెట్ గా లియోన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పుజారాతో కలిసి సెంచరీ వీరుడు వృద్ధిమాన్ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 199 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని అందించాడు. జడేజా మెరుపు ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ (55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచాడు. ఓకీఫ్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్(16) ఇచ్చిన క్యాచ్ ను వార్నర్ పట్టడంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 603 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.