
పుజారా 'అతి పెద్ద' ఇన్నింగ్స్!
రాంచీ: భారత క్రికెట్ జట్టు నయా వాల్ చటేశ్వర పుజారా సరికొత్త మైలురాయిని నమోదు చేశాడు. తన టెస్టు కెరీర్ లో బంతులు పరంగా అతి పెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఘనతను పుజారా తాజాగా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 390 బంతులను ఎదుర్కొన్న పుజారా తన పాత 'అతి పెద్ద' ఇన్నింగ్స్ ను సవరించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 391 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 150 పరుగుల మార్కును పుజారా చేరాడు. ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్ లో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడిన ఘనతను కూడా సాధించాడు.
అంతకుముందు 2012లో ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ లో జరిగిన టెస్టులో పుజారా 389 బంతులు ఆడి అజేయంగా 206 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ అతని 'అతి పెద్ద' ఇన్నింగ్స్. మరొకవైపు 2013లో హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పుజారా 341 బంతుల్లో 204 పరుగులు చేశాడు. ఈ రెండింటిలో పుజారా డబుల్ సెంచరీలు సాధించినప్పటికీ బంతులు పరంగా మాత్రం ప్రస్తుత ఇన్నింగ్స్ కంటే అవి తక్కువ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరొకవైపు భారత్ గడ్డపై నాలుగు వందలకు పైగా బంతులను ఎదుర్కొన్ననాల్గో స్వదేశీ ఆటగాడిగా పుజారా నిలిచాడు. తొలి స్థానంలో సునీల్ గవాస్కర్ (472 బంతులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంచితే, పుజారా బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ జట్టు 159.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. ఈ జోడి వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచింది.