3 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణెకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అజింక్యా రహానే(30; 25 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(31; 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్) లు దాటిగా బ్యాటింగ్ చేశారు.ఆ తరువాత స్టీవ్ స్మిత్(27; 24 బంతుల్లో3 ఫోర్లు), ఎంఎస్ ధోని(28;25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు సైతం మోస్తరుగా ఫర్వాలేదనించారు.
అయితే ఓ దశలో పుణె ఆటగాళ్లు వరుసగా క్యూకట్టేశారు. మూడు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయిన పుణె ఒక్కసారిగా చతికిలబడింది. 127 పరుగుల వద్ద ధోని మూడో వికెట్ పెవిలియన్ కు చేరగా, ఆపై అదే స్కోరు వద్ద స్టీవ్ స్మిత్ అవుటయ్యాడు. ఆపై 129 పరుగుల వద్ద క్రిస్టయన్, 130 పరుగుల వద్ద బెన్ స్టోక్స్, శార్దూల్ ఠాకూర్ లు అవుటయ్యారు. కాగా, చివర్లో మనోజ్ తివారీ బ్యాట్ ఝుళిపించడంతో పుణె స్కోరు బోర్డు ముందుకు కదిలింది. మనోజ్ తివారీ 11 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లతో 27 పరుగులు సాధించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మిల్నీ, అరవింద్ లు తలో రెండు వికెట్లు సాధించగా, శామ్యూల్ బద్రీ, షేన్ వాట్సన్, పవన్ నేగీ లకు చెరో వికెట్ దక్కింది.