పుణె మ్యాచ్లన్నీ విశాఖలోనే..
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మహారాష్ట్ర నుంచి తరలించే కొన్ని మ్యాచ్లను విశాఖలో నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఆడాల్సిన ఉన్న మ్యాచ్లు విశాఖపట్టణంలో జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం లీగ్ ఫ్రాంచైజీలతో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా సమావేశమైన అనంతరం నిర్ణయం తీసుకున్నారు.
విశాఖను పుణె హోం గ్రౌండ్ గా ఎంచుకోవడంతో కొంత వరకూ స్పష్టత రాగా, ముంబై ఇండియన్స్ జట్టు తమ నిర్ణయాన్ని చెప్పడానికి మరికొంత సమయాన్నికోరింది. ఏప్రిల్ 17వ తేదీ తరువాత తుది నిర్ణయం చెబుతామనడంతో ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ ఇంకా ఖరారు కాలేదు. అయితే తొలి క్వార్టర్ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ను బెంగళూరుకు మార్చే అవకాశం ఉండగా, రెండో క్వార్టర్ ఫైనల్, ఎలిమినేటర్ మ్యాచ్ను కోల్కతా లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
మహారాష్ట్రలో నీటి సమస్య కారణంగా ఆ రాష్ట్రంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలంటూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30 అనంతరం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌లకు చెందిన 13 మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది.