సింధు శుభారంభం
►అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి
►సాయిప్రణీత్, కశ్యప్, సమీర్ వర్మ కూడా ముందంజ
►కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన తర్వాత ఆడుతోన్న తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ తన దూకుడు కొనసాగించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ తెలుగు అమ్మాయి శుభారంభం చేసింది. ప్రపంచ 17వ ర్యాంకర్ ఎన్గాన్ యి చెయుంగ్‌తో జరిగిన తొలి రౌండ్ పోరులో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతంలో మూడుసార్లు ఈ టోర్నీలో ఆడిన సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆమె ఈసారి టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉంది.
సియోల్: కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ లక్ష్యంగా కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ పీవీ సింధు తొలి అడ్డంకిని సాఫీగా అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–13, 21–8తో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎన్గాన్ యి చెయుంగ్‌పై గెలిచింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎన్గాన్ యి చెయుంగ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అతికష్టమ్మీద 87 నిమిషాల్లో గెలిచిన సింధు ఈసారి మాత్రం ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.
తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడినా మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సింధు జోరు పెరిగింది. రెండో గేమ్‌లోనైతే సింధు ధాటికి చెయుంగ్ ఎదురునిలువలేకపోయింది. ఓవరాల్‌గా చెయుంగ్‌పై సింధుకిది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 1–1తో సమంగా ఉన్నారు.
ప్రణయ్, సౌరభ్ వర్మ పరాజయం
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హెచ్‌ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. కశ్యప్ 21–13, 21–16తో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, సాయిప్రణీత్ 21–15, 21–10తో హు యున్ (హాంకాంగ్)పై, సమీర్ వర్మ 21–13, 21–23, 21–9తో ప్రపంచ 13వ ర్యాంకర్ తనోంగ్‌సక్ సెన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించారు. ప్రణయ్ 17–21, 23–21, 14–21తో ఆరో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సౌరభ్ వర్మ 21–18, 13–21, 19–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.
సాత్విక్–చిరాగ్ జోడీ విజయం
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–9, 22–24, 21–12తో లీ షెంగ్ ము–లిన్ చియా యు (చైనీస్ తైపీ) జోడీపై గెలుపొందగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 11–21, 10–21తో చుంగ్ సియోక్–కిమ్ డక్ యుంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీ 18–21, 19–21తో తాంగ్ చున్ మాన్–సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్పప్ప జోడీ 21–19, 13–21, 17–21తో ఫి చో సూంగ్–జింగ్ యి తీ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి.
► గురువారం జరిగే పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్; వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో సమీర్ వర్మ; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో సాయి ప్రణీత్ తలపడతారు.