సింధు, శ్రీకాంత్‌ శుభారంభం | PV Sindhu, Kidambi Srikanth enter 2nd round of Indonesia Open | Sakshi
Sakshi News home page

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

Published Thu, Jul 18 2019 1:28 AM | Last Updated on Thu, Jul 18 2019 1:28 AM

PV Sindhu, Kidambi Srikanth enter 2nd round of Indonesia Open - Sakshi

జకార్తా: అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ భారత అగ్రశ్రేణి సింగిల్స్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు 11–21, 21–15, 21–15తో అయా ఒహోరి (జపాన్‌)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–14, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం కాగా... నిషిమోటోపై శ్రీకాంత్‌కిది ఐదో గెలుపు. మరోవైపు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ల పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. సాయిప్రణీత్‌ 15–21, 21–13, 10–21తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌) చేతిలో... ప్రణయ్‌ 21–19, 18–21, 20–22తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 13–21, 11–21తో తొంతోవి అహ్మద్‌–విన్నీ కండౌ (ఇండోనేసియా) జంట చేతిలో... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) జోడీ 11–21, 17–21తో లియావో మిన్‌ చున్‌–సు చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. గురువారం జరిగే సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సింధు; ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) శ్రీకాంత్‌ ఆడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సి వె–హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) ద్వయం... పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మార్కస్‌ గిడియోన్‌–కెవిన్‌ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట తలపడతాయి.

ప్రతీసారి ఆటగాళ్లతో వెళ్లడం కుదరదు!

అలా చేస్తే కొత్తవాళ్లను తయారు చేయలేం
భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మేజర్‌ టోర్నీ బరిలోకి దిగినా దాదాపు ప్రతీసారి వారి వెంట చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కనిపించేవారు. కోర్టు పక్కన కోచ్‌ స్థానం లో కూర్చొని ఆయన ఇచ్చే అమూల్య సలహాలతో షట్లర్లు అద్భుత ఫలితాలు సాధించారు. అయితే ఇటీవల గోపీచంద్‌ వారితో తరచుగా ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణకే పరిమితమయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆయన... ఆటగాళ్లతో ప్రతీ టోర్నీకి వెళ్లడం సాధ్యం కాదని, ప్రణాళిక ప్రకారమే తన ప్రయాణాలు తగ్గించానని స్పష్టం చేశారు. ‘నేను టాప్‌ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న  ఇతర షట్లర్ల పరిస్థితి ఏమవుతుంది? టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా? వాస్తవానికి మనకు ఎక్కువ కోచ్‌ల అవసరం ఉంది.

నేను ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరత్రా సహాయం, మద్దతు అవసరం’ అని గోపీచంద్‌ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌ ఉన్న ఏడాదిలోనే తాను ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు. ‘ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూచనలు తీసుకోవాలని, నేను వారికి ఎక్కువ సేపు కోచింగ్‌ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ అది ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతూనే ఉంటారు’ అని గోపీచంద్‌ వివరించారు. 2019 చివరి వరకు ఆటగాళ్లతో ప్రయాణించే ఆలోచన లేదని... వచ్చే ఏడాది మాత్రం ఒలింపిక్స్‌ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళ్లి తన ప్రణాళికను రూపొందించుకుంటానని గోపీ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement