Indonesia Open Super Series badminton tournament
-
రన్నరప్‌తో సరి
ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశ ఎదురైంది. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ ఆడిన ఆమె ఇండోనేసియా ఓపెన్‌లో తుది మెట్టుపై బోల్తా పడింది. తన ఫైనల్ ప్రత్యర్థిపై పదిసార్లు నెగ్గిన రికార్డు ఉన్నప్పటికీ కీలక తరుణంలో తప్పిదాలతో సింధు మూల్యం చెల్లించుకొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతంలో సింధుపై పద్నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లే నెగ్గిన అకానె యామగుచి ఈ సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో టైటిల్‌ను సాధించింది. జకార్తా: క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులపై అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 15–21, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత అకానె యామగుచికి 87,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 60 లక్షల 28 వేలు)తోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 42,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షల 28 వేలు)తోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత డిసెంబర్లో సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అనంతరం సింధుకు ఇండోనేసియా ఓపెన్ రూపంలో ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే అవకాశం వచ్చింది. కానీ 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు కీలకదశలో తప్పిదాలు చేసి విజయానికి దూరమైంది. వివిధ టోర్నీల్లో యామగుచితో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితం రాబట్టలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై అలవోకగా నెగ్గిన సింధు తుది సమరంలో మాత్రం వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది జర్మన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచిన యామగుచి ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడింది. పలుమార్లు వెనుకపడ్డా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి సింధు ఆట కట్టించింది. తొలి గేమ్‌లో సింధు 14–12తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో... యామగుచి అద్భుత ఆటతీరుతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించగా... వెంటనే యామగుచి మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు యామగుచి రెండు పాయింట్లు గెలిచి 6–4తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యామగుచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘అకానె యామగుచి అద్భుతంగా ఆడింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీల్లో ఆమెనే పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో నేను రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో తప్పిదాలు చేశాను. ఈ అవకాశాలను ఆమె అనుకూలంగా మల్చుకుంది. నేను తొలి గేమ్‌లో గెలిచిఉంటే తుది ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో యామగుచికి నేను ఆరేడు పాయింట్ల ఆధిక్యం ఇచ్చాను. దాంతో నేను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. తుది ఫలితం నిరాశపరిచినా ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడనున్నాను. అక్కడ మరింత మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది.’ –పీవీ సింధు -
టైటిల్‌కు విజయం దూరంలో...
మరోసారి సాధికారిక ప్రదర్శనతో అలరించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. సీజన్లో తొలి టైటిల్ లోటును తీర్చుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తుది సమరానికి అర్హత సాధించింది. జకార్తా: నెల రోజులపాటు లభించిన విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సాధన చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 46 నిమిషాల్లో 21–19, 21–10తో ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో వెనుదిరిగిన ఈ తెలుగమ్మాయి తాజా గెలుపుతో సీజన్లో తొలి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–4తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచి 21–9, 21–15తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, స్విస్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న చెన్ యుఫె ఆటలు సింధు ముందు సాగలేదు. తొలి గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. నాలుగుసార్లు చెన్ యుఫె ఆధిక్యంలోకి వెళ్లినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. సింధు 14–18తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 19–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్ యుఫె ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే సింధు రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు తడబడినట్లు కనిపించినా వెంటనే గాడిలో పడింది. 2–5తో వెనుకబడిన దశలో సింధు వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్కోరు 10–8తో ఉన్నదశలో సింధు వరుసగా 8 పాయింట్లు సాధించి 18–8తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 3 ఇండోనేసియా ఓపెన్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన మూడో ప్లేయర్‌గా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ వరుసగా నాలుగుసార్లు (2009, 2010, 2011, 2012) ఫైనల్ చేరి మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 2017లో విజేతగా నిలిచాడు. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ భారత అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం కాగా... నిషిమోటోపై శ్రీకాంత్‌కిది ఐదో గెలుపు. మరోవైపు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 11–21తో తొంతోవి అహ్మద్–విన్నీ కండౌ (ఇండోనేసియా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 11–21, 17–21తో లియావో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. గురువారం జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) శ్రీకాంత్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట తలపడతాయి. ప్రతీసారి ఆటగాళ్లతో వెళ్లడం కుదరదు! అలా చేస్తే కొత్తవాళ్లను తయారు చేయలేం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మేజర్ టోర్నీ బరిలోకి దిగినా దాదాపు ప్రతీసారి వారి వెంట చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కనిపించేవారు. కోర్టు పక్కన కోచ్ స్థానం లో కూర్చొని ఆయన ఇచ్చే అమూల్య సలహాలతో షట్లర్లు అద్భుత ఫలితాలు సాధించారు. అయితే ఇటీవల గోపీచంద్ వారితో తరచుగా ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణకే పరిమితమయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆయన... ఆటగాళ్లతో ప్రతీ టోర్నీకి వెళ్లడం సాధ్యం కాదని, ప్రణాళిక ప్రకారమే తన ప్రయాణాలు తగ్గించానని స్పష్టం చేశారు. ‘నేను టాప్ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న ఇతర షట్లర్ల పరిస్థితి ఏమవుతుంది? టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా? వాస్తవానికి మనకు ఎక్కువ కోచ్‌ల అవసరం ఉంది. నేను ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరత్రా సహాయం, మద్దతు అవసరం’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఉన్న ఏడాదిలోనే తాను ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు. ‘ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూచనలు తీసుకోవాలని, నేను వారికి ఎక్కువ సేపు కోచింగ్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ అది ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతూనే ఉంటారు’ అని గోపీచంద్ వివరించారు. 2019 చివరి వరకు ఆటగాళ్లతో ప్రయాణించే ఆలోచన లేదని... వచ్చే ఏడాది మాత్రం ఒలింపిక్స్ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళ్లి తన ప్రణాళికను రూపొందించుకుంటానని గోపీ వెల్లడించారు. -
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
జ్వాల-అశ్విని జోడి ఔట్ ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో సైనా 21-17, 21-9 తేడాతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో సారి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసిన ఎనిమిదో సీడ్ సైనా.. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, చైనా క్రీడాకారిణి జురుయ్ లీతో తలపడనుంది. జురుయ్ లీ రెండో రౌండ్లో 21-12, 21-19తో అడ్రియంటి ఫిర్దాసరిపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఇరువురి మధ్య ఇప్పటిదాకా జరిగిన ముఖాముఖి పోరులో సైనాపై 6-2తో జురుయ్ లీదే పైచేయిగా ఉంది. అయితే ఇదే టోర్నీలో 2012 ఫైనల్లో జురుయ్ లీని ఓడించి విజేతగా నిలిచిన రికార్డు సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ఇక మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప జోడి పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసింది. కొరియా జంట యీ నా జంగ్-సో యంగ్ కిమ్ చేతిలో జ్వాల-అశ్విని ద్వయం 16-21, 21-15, 12-21 తేడాతో ఓటమిపాలైంది. -
రెండో రౌండ్లో సైనా
- సింధు, కశ్యప్, శ్రీకాంత్ ఔట్ - ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ తన జోరు కొనసాగించింది. తనకు అచ్చొచ్చిన ఈ టోర్నీలో సైనా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 21-15, 21-10 స్కోరుతో వరల్డ్ నంబర్ 9 పోర్న్‌టిప్ బురానా (థాయిలాండ్)ను చిత్తు చేసింది. బురానాపై సైనా గెలవడం ఇది ఏడో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో మూడు సార్లు (2009, 2010, 2012) చాంపియన్‌గా నిలిచిన సైనా తన రెండో రౌండ్ మ్యాచ్‌లో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)ను ఎదుర్కొంటుంది. అయితే మరో భారత క్రీడాకారిణి పీవీ సింధుకు మాత్రం నిరాశే ఎదురైంది. తొలి రౌండ్లో సింధు 24-26, 17-21 తేడాతో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్) 19-21, 21-8, 24-22తో కశ్యప్‌పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 12-21, 21-17, 16-21తో చెన్ యూకున్ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. జ్వాల జోడి విజయం మహిళల డబుల్స్‌లో భారత్ శుభారంభం చేసింది. గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి తొలి రౌండ్లో 13-21, 22-20, 21-11 స్కోరుతో పియా జెబాదియా-రిజ్కీ అమెలియా (ఇండోనేసియా)పై విజయం సాధించింది.