ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశ ఎదురైంది. ఈ సీజన్‌లో తొలిసారి ఫైనల్ ఆడిన ఆమె ఇండోనేసియా ఓపెన్‌లో తుది మెట్టుపై బోల్తా పడింది. తన ఫైనల్ ప్రత్యర్థిపై పదిసార్లు నెగ్గిన రికార్డు ఉన్నప్పటికీ కీలక తరుణంలో తప్పిదాలతో సింధు మూల్యం చెల్లించుకొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతంలో సింధుపై పద్నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లే నెగ్గిన అకానె యామగుచి ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో టైటిల్‌ను సాధించింది.
జకార్తా: క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులపై అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 15–21, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత అకానె యామగుచికి 87,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 60 లక్షల 28 వేలు)తోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 42,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షల 28 వేలు)తోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
గత డిసెంబర్‌లో సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అనంతరం సింధుకు ఇండోనేసియా ఓపెన్ రూపంలో ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే అవకాశం వచ్చింది. కానీ 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు కీలకదశలో తప్పిదాలు చేసి విజయానికి దూరమైంది. వివిధ టోర్నీల్లో యామగుచితో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితం రాబట్టలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై అలవోకగా నెగ్గిన సింధు తుది సమరంలో మాత్రం వరుస గేముల్లో ఓటమి చవిచూసింది.
ఈ ఏడాది జర్మన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచిన యామగుచి ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడింది. పలుమార్లు వెనుకపడ్డా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి సింధు ఆట కట్టించింది. తొలి గేమ్‌లో సింధు 14–12తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో... యామగుచి అద్భుత ఆటతీరుతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించగా... వెంటనే యామగుచి మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు యామగుచి రెండు పాయింట్లు గెలిచి 6–4తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యామగుచి విజయాన్ని ఖాయం చేసుకుంది.
‘అకానె యామగుచి అద్భుతంగా ఆడింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీల్లో ఆమెనే పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో నేను రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో తప్పిదాలు చేశాను. ఈ అవకాశాలను ఆమె అనుకూలంగా మల్చుకుంది. నేను తొలి గేమ్‌లో గెలిచిఉంటే తుది ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో యామగుచికి నేను ఆరేడు పాయింట్ల ఆధిక్యం ఇచ్చాను. దాంతో నేను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. తుది ఫలితం నిరాశపరిచినా ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడనున్నాను. అక్కడ మరింత మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది.’
–పీవీ సింధు
Comments
Please login to add a commentAdd a comment