రెండో రౌండ్‌లో సైనా | Saina Nehwal wins but P V Sindhu, K Srikanth, P Kashyap bow out of Indonesia Open | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సైనా

Published Thu, Jun 19 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

రెండో రౌండ్‌లో సైనా

రెండో రౌండ్‌లో సైనా

- సింధు, కశ్యప్, శ్రీకాంత్ ఔట్  
- ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్

జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ తన జోరు కొనసాగించింది. తనకు అచ్చొచ్చిన ఈ టోర్నీలో సైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 21-15, 21-10 స్కోరుతో వరల్డ్ నంబర్ 9 పోర్న్‌టిప్ బురానా (థాయిలాండ్)ను చిత్తు చేసింది. బురానాపై సైనా గెలవడం ఇది ఏడో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో మూడు సార్లు (2009, 2010, 2012) చాంపియన్‌గా నిలిచిన సైనా తన రెండో రౌండ్ మ్యాచ్‌లో కిర్‌స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)ను ఎదుర్కొంటుంది. అయితే మరో భారత క్రీడాకారిణి పీవీ సింధుకు మాత్రం నిరాశే ఎదురైంది.

తొలి రౌండ్‌లో సింధు 24-26, 17-21 తేడాతో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్) 19-21, 21-8, 24-22తో కశ్యప్‌పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 12-21, 21-17, 16-21తో చెన్ యూకున్ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
 
జ్వాల జోడి విజయం
 మహిళల డబుల్స్‌లో భారత్ శుభారంభం చేసింది. గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి తొలి రౌండ్‌లో 13-21, 22-20, 21-11 స్కోరుతో పియా జెబాదియా-రిజ్కీ అమెలియా (ఇండోనేసియా)పై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement