హాంకాంగ్: భారత టాప్ షట్లర్, రెండో సీడ్ పీవీ సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఐదోసీడ్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన క్వార్టర్స్ పోరులో 21–12, 21–19తో వరుస గేమ్‌లలో విజయం సాధించింది. 36 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్‌లో యామగుచి జోరు పుంజుకోకముందే సింధు నెట్‌గేమ్ ద్వారా 6–1 ఆధిక్యాన్ని సంపాదించింది. సుదీర్ఘమైన ర్యాలీల తర్వాత తొలి గేమ్‌ను 21–12తో ముగించింది. రెండో గేమ్‌లో ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది.
ఇద్దరు ఆటగాళ్లూ నెట్ గేమ్‌కే మొగ్గు చూపారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న యామగుచి డ్రాప్ షాట్లతో సింధుకు చెమటలు పట్టించింది. 8–8తో సమానంగా ఉన్న పరిస్థితినుంచి.. కాసేపటికే 14–8తో జపాన్ షట్లర్ దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో యామగుచిని బ్యాక్ కోర్టు గేమ్‌తో అడ్డుకున్న సింధు.. 18–18తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. సెమీస్‌లో మాజీ ప్రపంచ చాంపియన్, థాయ్‌లాండ్ షట్లర్ ఇంతనోన్ రచనోక్‌తో సింధు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment