సింధు సాధించెన్
ఫుజు (చైనా):భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ను సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి గేమ్ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది
మూడో గేమ్ లో దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచి మ్యాచ్ పై ఆసక్తిని రేపారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్ను సొంతం చేసుకుంది. అదే క్రమంలో సున్ యు పదే పదే తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. తాజా విజయంతో తన ముఖాముఖి రికార్డును సింధు 3-3 తో సమం చేసింది. ఈ మేరకు చైనా సూపర్ సిరీస్ టైటిల్ వేటలోఆద్యంతం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పివి సింధుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.