రహానే అరుదైన ఫీట్!
కొలంబో: భారత క్రికెటర్ అజింక్యా రహానే అరుదైన ఫీట్ ను సాధించాడు. శ్రీలంకతో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో రహానే 50 క్యాచ్ ల మార్కును చేరాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన రెండో భారత ఫీల్డర్ గా రహానే గుర్తింపు సాధించాడు. రహానే 39 టెస్టుల తరువాత 50 క్యాచ్ లను అందుకున్నాడు. కాగా, అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించిన భారత ఆటగాడు ఏక్ నాథ్ సోల్కర్. సోల్కార్ 26 టెస్టుల్లో 50 క్యాచ్ లను మార్కును చేరాడు.
లంకేయులపై విజయం సాధించిన రెండో టెస్టులో రహానే ఐదు క్యాచ్ లను పట్టి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే(25 పరుగులు, 141 పరుగులు) ను రెండు ఇన్నింగ్స్ లో ఇచ్చిన క్యాచ్ లను రహానే పట్టుకున్నాడు. శ్రీలంకతో్ జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో తొలిసారి లంకలో ఇన్నింగ్స్ తేడా విజయాన్ని నమోదు చేసింది. ఇది భారత్ కు వరుసగా ఎనిమిదో సిరీస్ విజయం కాగా, వరుసగా అత్యధిక టెస్టు సిరీస్ లు ఘనత ఆసీస్ పేరిట ఉంది. 2005 నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఆసీస్ జట్టు వరుసగా తొమ్మిది సిరీస్ విజయాల్ని సాధించింది.