భారత్ ‘ఎ’ జట్టు కోచ్‌గా ద్రవిడ్ | Rahul dravid as india 'A' team coach | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ జట్టు కోచ్‌గా ద్రవిడ్

Published Sun, Jun 7 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

భారత్ ‘ఎ’ జట్టు కోచ్‌గా ద్రవిడ్

భారత్ ‘ఎ’ జట్టు కోచ్‌గా ద్రవిడ్

అండర్-19 టీమ్‌కు కూడా...
 
 కోల్‌కతా : మిస్టర్ డిపెండబుల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను... భారత్ ‘ఎ’ జట్టు కోచ్‌గా నియమించారు. అండర్-19 జట్టు కోచింగ్ బాధ్యతలు కూడా తనకే అప్పగించారు. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో తొలిసారి సమావేశమైన బీసీసీఐ సలహాదారులు సచిన్, గంగూలీ, లక్మణ్‌లతో కూడిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే బంగ్లాదేశ్ పర్యటనకు టీమ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి భవితవ్యంపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్ ’ఎ’, అండర్-19 జట్లకు కోచ్‌గా పని చేసేందుకు ద్రవిడ్ అంగీకరించారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సమావేశం అనంతరం వెల్లడించారు. ఇది భారత క్రికెట్‌కు శుభపరిణామమని వ్యాఖ్యానించారు.

భారత్ తరఫున 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన ద్రవిడ్‌ను భారత జాతీయ జట్టుకు కోచ్‌గా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ కుటుంబ బాధ్యతల వల్ల ఆ పదవిని చేపట్టేందుకు ఈ కర్ణాటక ఆటగాడు విముఖత చూపడంతో భవిష్యత్ కుర్రాళ్లను తీర్చిదిద్దే బాధ్యతలను అప్పగించారు. భారత్ ‘ఎ’ జట్టుతో పాటు ద్రవిడ్ కూడా విదేశీ టూర్లకు వెళ్తాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

 ‘ఎ’ జట్టుకు విదేశీ టూర్లు
 సలహా కమిటీ తొలి సమావేశం గురించి ఠాకూర్ మాట్లాడుతూ... ‘భారత్ ‘ఎ’ జట్టుకు ఎక్కువగా విదేశీ పర్యటనలు ఉండాలని సూచించారు. ఏ జట్టుకు అవసరమైనా సేవలందించేందుకు ముగ్గురు సంసిద్ధత వ్యక్తం చేశారు. 15 మంది ఫాస్ట్ బౌలర్లు, 15 మంది స్పిన్నర్లతో పూల్‌ను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైన కోచ్‌లను నియమించాలని ముఖ్య ప్రతిపాదన చేశారు. అలాగే భారత క్రికెటర్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సమయం కేటాయిస్తామన్నారు’ అని కార్యదర్శి వెల్లడించారు. కమిటీ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు లేవని కేవలం గౌరవ వేతనం మాత్రమే ఉంటుందని ఠాకూర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement