రాహుల్ ద్రవిడ్పై ప్రశంసలు
న్యూఢిల్లీ:ఇంగ్లండ్ తో చివరిదైన ఐదో టెస్టులో భారత ఆటగాడు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్.. దిగ్గజ ఆటగాడు, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కరుణ్ నాయర్ ట్రిపుల్ చేయడం వెనుక రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందని కొనియాడాడు. యువ క్రికెటర్లకు అమూల్యమైన టెక్నిక్స్ను నేర్పుతూ వారు రాణించడానికి ద్రవిడ్ పరోక్షంగా కారణమవుతున్నాడన్నాడు.
'భారత జట్టు అసాధారణ ప్రదర్శనను అభినందిస్తున్నా. మూడో ఇన్నింగ్స్ లోనే కరుణ్ నాయర్ ఆకట్టుకోవడం అతనిలో సత్తాకు నిదర్శనం. 25 ఏళ్లకే ట్రిపుల్ను సాధించడమంటే అది నిజంగానే గొప్ప ఘనత.అ తనికి ప్రత్యేక అభినందనలు. ప్రధానంగా అండర్19, భారత్-ఎ సైడ్లు ప్లాట్ఫాం పటిష్టంగా ఉండటంతోనే భారత జాతీయ జట్టు బలంగా కూడా పెరుగుతుంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కుర్రాళ్లు రాటుదేలుతున్నారు. అతని ఇచ్చే సూచనలు, అనుభవం యువ క్రికెటర్లకు వరంలా మారుతుంది'అని అనురాగ్ ఠాకూర్ ప్రశంసించాడు.ఇంగ్లండ్ తో చివరి టెస్టులో కరుణ్ నాయర్ అజేయ ట్రిపుల్ సాధించిన సంగతి తెలిసిందే.