
సాక్షి, బెంగుళూరు : పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఈ వివాదంపై ఓవర్ రియాక్ట్ కావొద్దంటూ సూచించారు. మైదానంతోపాటు బయట ఉండే సవాళ్లపట్ల ఆటగాళ్లకు చక్కని అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. చాలా ఏళ్లుగా ఇండియా ఏ, అండర్ 19 క్రికెట్లో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ట్రైనింగ్ ఉంటుందని అన్నారు. తీరికలేని షెడ్యూల్ వల్ల టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి ఎక్కువగా హాజరుకాలేక పోతున్నారని చెప్పారు. కాగా, ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్, కేఎల్ రాహుల్ జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే.
‘గతంలో ఆటగాళ్లెవరూ ఇలాంటి పొరపాట్లు చేయలేదని కాదు. వర్క్‌షాప్‌లు నిర్వహించి అవగాహన కల్పించినంత మాత్రాన మళ్లీ అటువంటి ఘటనలు జరగవని కాదు. కానీ, పాండ్యా, రాహుల్ వివాదం మాదిరిగా ఏవైనా జరిగినప్పుడు ఓవర్ రియాక్ట్ కావొద్దు. వివాదాస్పద వ్యాఖ్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తపడాలి కానీ, ఘటన జరిగిన తర్వాత వకాల్తా పుచ్చుకొని ఇష్టారీతిన కామెంట్లు చేయొద్దు’ అని ద్రవిడ్ సూచించాడు. గతంలో చోటుచేసుకున్న పొరపాట్ల గుర్తెరిగి ఆటగాళ్లు మసలుకోవాలి. భారత ఆటగాడిగా తమపై ఉన్న గురుతర బాధ్యతల్ని ప్రతి ఒక్క ఆటగాడు మరువకూడదు’ అని ద్రవిడ్ మీడియాతో అన్నారు.
ఒక్కో ఆటగాడు ఒక్కో నేపథ్యం నుంచి జట్టులోకి వస్తాడని, వ్యవస్థను తప్పుబట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. కర్ణాటక సీనియర్ ఆటగాళ్లు, తల్లిదండ్రులు, పెద్దల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చుట్టూ ఉన్నవారిని గమనించి మంచి విషయాలు అలవర్చుకున్నానని, తనకు మరెవరో వచ్చి పాఠాలు చెప్పేలా ఎప్పుడూ ప్రవర్తించనని వెల్లడించారు.