‘టాప్’ రాయల్స్ | Rajasthan Royals reaches semifinals of champions league | Sakshi
Sakshi News home page

‘టాప్’ రాయల్స్

Published Wed, Oct 2 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

‘టాప్’ రాయల్స్

‘టాప్’ రాయల్స్

సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ఈ మైదానంలో ఓటమి లేకుండా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన రాయల్స్, సీఎల్‌టి20లోనూ ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచింది.
 
  గ్రూప్ ‘ఎ’ లో అగ్రస్థానంలో నిలిచి జైపూర్‌లోనే సెమీస్ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది. మరో వైపు టి20 క్రికెట్‌లో వరుసగా పదిహేను విజయాలు సాధించి ఊపు మీదున్న ఒటాగో వోల్ట్స్‌కు బ్రేక్ పడింది. ఇక ముంబై మ్యాచ్ ఫలితంపై ఒటాగో సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి.
 
 జైపూర్: చాంపియన్స్ లీగ్ టి20 గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్ రాయల్స్ అజేయంగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ .. వికెట్ల తేడాతో ఒటాగో వోల్ట్‌ను చిత్తు చేసింది. రాహుల్ శుక్లా (3/23) బౌలింగ్‌లో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒటాగో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 నీషామ్ (25 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అజింక్య రహానే (48 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా... చివర్లో బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. రాహుల్ శుక్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
 
 ఒకే ఓవర్లో 3 వికెట్లు...
 ఒటాగో తొలి 3 ఓవర్లలో 16 పరుగులు చేసింది. ఈ దశలో రాజస్థాన్ బౌలర్ రాహుల్ శుక్లా చెలరేగి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుక్లా తన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే... రూథర్ ఫోర్డ్ (5), బ్రెండన్ మెకల్లమ్ (0), బూర్డర్ (0)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.
 
 ఆ తర్వాతి ఓవర్లో బ్రూమ్ (11)ను వాట్సన్ వెనక్కి పంపడంతో ఒటాగో 21 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో డస్కటే (27 బంతుల్లో 26; 3 ఫోర్లు), నీషామ్ కలిసి జట్టును ఆదుకున్నారు. వరుస ఓవర్లలో వీరిద్దరు పెవిలియన్ చేరగా...చివర్లో నాథన్ మెకల్లమ్ (20 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి వోల్ట్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
 రాణించిన రహానే...
 తొలి వికెట్‌కు 40 బంతుల్లో 49 పరుగులు జోడించిన అనంతరం ద్రవిడ్ (10) వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సామ్సన్ (5), వాట్సన్ (2), బిన్నీ (1) కూడా అవుట్ కావడంతో ఒక్కసారిగా రాయల్స్ ఇన్నింగ్స్ తడబడింది. అయితే రహానే మాత్రం తన జోరు తగ్గించకుండా చక్కటి స్ట్రోక్‌లతో జట్టును నడిపించాడు. ఈ క్రమంలో 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ దశలో రాయల్స్ వెనకపడ్డట్లు కనిపించినా... హాడ్జ్ సంచలన హిట్టింగ్‌తో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందించాడు.
 
 స్కోరు వివరాలు
 ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) సామ్సన్ (బి) వాట్సన్ 11; రూథర్‌ఫోర్డ్ (బి) శుక్లా 5; బ్రెండన్ మెకల్లమ్ (ఎల్బీ) (బి) శుక్లా 0; బూర్డర్ (సి) అండ్ (బి) శుక్లా 0; టెన్ డస్కటే (ఎల్బీ) (బి) తాంబే 26; నీషామ్ (సి) వాట్సన్ (బి) కూపర్ 32; నాథమ్ మెకల్లమ్ (నాటౌట్) 28; బట్లర్ (బి) కూపర్ 25; వాగ్నర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139.
 
 వికెట్ల పతనం: 1-16; 2-20; 3-20; 4-21; 5-74; 6-81; 7-120.
 బౌలింగ్: మేనరియా 1-0-9-0; ఫాల్క్‌నర్ 4-0-28-0; వాట్సన్ 3-0-24-1; శుక్లా 4-1-23-3; కూపర్ 4-0-33-2; తాంబే 4-0-17-1.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) నాథన్ మెకల్లమ్ (బి) బియర్డ్ 10; రహానే (సి) బ్రూమ్ (బి) నీషామ్ 52; సామ్సన్ (బి) నీషామ్ 5; వాట్సన్ (సి) బూర్డర్ (బి) నీషామ్ 2; బిన్నీ (సి) బ్రెండన్ మెకల్లమ్ (బి) వాగ్నర్ 1; హాడ్జ్ (నాటౌట్) 52; ఫాల్క్‌నర్ (బి) వాగ్నర్ 2; కూపర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 142.
 
 వికెట్ల పతనం: 1-49; 2-67; 3-71; 4-72; 5-116; 6-130.
 బౌలింగ్: బట్లర్ 3.1-0-37-0; మెక్‌మిలన్ 4-0-26-0; వాగ్నర్ 4-0-33-2; బియర్డ్ 4-0-23-1; నీషామ్ 4-0-22-3.
 
 ముంబైకి మంచి చాన్స్
 సచిన్ రంగు దుస్తుల్లో తన చివరి మ్యాచ్‌ను నేడు ఆడబోతున్నాడా..? లేక మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం  ముంబై ఇండియన్స్ చేతుల్లోనే ఉంది. ఒటాగోపై విజయం ద్వారా రాజస్థాన్... ముంబైకి మంచి అవకాశాన్ని అందించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పెర్త్‌పై గెలవడంతో పాటు, రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే... ముంబై నాకౌట్ సమరానికి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సచిన్‌కు  ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. సీఎల్‌టి20తో మాస్టర్ పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.
 
 చాంపియన్స్ లీగ్‌లో నేడు
 ముంబై     x  పెర్త్
 సా. గం. 4.00 నుంచి
 చెన్నై    x ట్రినిడాడ్
 రా. గం. 8.00 నుంచి
 వేదిక: న్యూఢిల్లీ
 స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement