కరాచీ: టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో యువ భారత్ తమ జోరు కొనసాగిస్తుండటంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెటర్లు, మాజీ దిగ్గజాలతో పాటు పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ద్రవిడ్ నైపుణ్యాన్ని, ఆటపట్ల అతడి అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రతి ప్రత్యర్థి జట్టును చిత్తుచేసిన యువ టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సైతం యువ భారత్ విజయాలపై స్పందిస్తూ ద్రవిడ్ లాంటి వ్యక్తి వారి దేశానికి కావాలని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా
‘అండర్ 19 క్రికెట్ జట్టు రాహల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్‌కు ద్రవిడ్ లాంటి వ్యక్తే కావాలి. అతడి కోచింగ్‌లో శుబ్‌మాన్ గిల్, మరికొందరు యువ సంచలనాలు తయారయ్యారు. ఒత్తిడిని ఎదుర్కొని ఎలా ఆడాలో జట్టును బాగా సిద్ధం చేశాడు ద్రవిడ్. భారత యువ క్రికెటర్లు ద్రవిడ్ నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఆటతో పాటు అంకితభావాన్ని, నిబద్ధతను కూడా వారు అలవాటు చేసుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సెమిస్‌లో పాక్ బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. ద్రవిడ్ కోచింగ్ ఇచ్చిన జట్టు చేతిలో యువ పాక్ జట్టు 203 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసిందంటేనే ఆ కోచ్ ఆటగాళ్లలో ఎంత ఉత్సాహాన్ని నింపుతారో అర్థమవుతోంది. అందుకే పాకిస్తాన్‌కు ఓ ద్రవిడ్ అవసరం ఎంతైనా ఉందని’ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment