అండర్-19 వరల్డ్ కప్: పాక్‌తో మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌తో ద్రవిడ్ సెల్పీలు
న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసి.. అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది. అండర్-19 క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 203 పరుగుల తేడాతో యువ భారత జట్టు దాయాదిని చిత్తు చేసింది. సహజంగానే యువ ఇండియా వీరోచిత ప్రదర్శన పాక్ ఆటగాళ్లను కకావికలం చేయడమే కాకుండా.. అటు పాక్ అభిమానుల్ని కూడా బిత్తరపోయేలా చేసింది.
పాక్ యువ క్రికెటర్ల బేలతనంపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న దాయాది జట్టు అభిమానులు రాహుల్ ద్రవిడ్ లాంటి కోచ్ తమ జట్టుకు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, తమ జట్టుకు ప్రముఖ ఆటగాడు మార్గదర్శకత్వం లేనందువల్లే ఇంతటి పరాజయం ఎదురైందని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
యువ వరల్డ్ కప్‌లో అసాధారణంగా రాణిస్తున్న శుభం గిల్ సెమీఫైనల్‌లోనూ చెలరేగి సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్ చేసిన కుర్రాళ్ల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. అనంతరం ఇషాన్ పోరెల్ బంతితో నిప్పులు చెరిగి నాలుగు వికెట్లు తీయడంతో దాయాది జట్టు 69 పరుగులకు చాపచుట్టేసింది.
తాజా అండర్-19 వరల్డ్ కప్‌లో యువ జట్టు సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వ పటిమ ఉంది. కోచ్‌గా జట్టును వెనకుండి నడిపిస్తున్న ద్రవిడ్.. తన అనుభవాన్నంతా రంగరించి.. యువ జట్టులో స్ఫూర్తినింపుతున్నారు. వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో, సెమీఫైనల్‌లో యువ ఇండియా జట్టు చూపిన ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో కోచ్ విషయమై రెండు జట్ల మధ్య వైరుధ్యాన్ని పాక్ అభిమానులు ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు. పాక్ యువ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మన్సూర్ రణా కేవలం రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి.. 15 పరుగులు చేశాడు. ఎలాంటి వికెట్లు తీయలేదు. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవమూ అతడికి లేదు. ఈ నేపథ్యంలో అపార అనుభవమున్న ద్రవిడ్ మార్గదర్శకత్వంలోని టీమిండియాకు.. ఏ అనుభవం, నైపుణ్యమూలేని మన్సూర్ రాణా కోచ్‌గా ఉన్న పాక్ జట్టుకు మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని దాయాది ఫ్యాన్స్ వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment