అండర్-19 వరల్డ్‌కప్ ట్రోఫీతో యువభారత్
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్‌పై ఘనవిజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్న యువభారత్ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చింది. తొలి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు అన్ని భారీ విజయాలనే నమోదు చేసింది. ఏ జట్టుపై గెలిచి అద్భుత ఆరంభం అందుకుందో అదే జట్టుపై ఫైనల్లో గెలిచి కప్ సొంతం చేసుకుంది. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడకుండా టైటిల్ నిలబెట్టుకోవడం ఇక్కడ విశేషం. ఇక పృథ్వీషా నేతృత్వంలోని యువభారత్ విజయాలను పరిశీలిస్తే.. కుర్రాళ్ల సమిష్టి ప్రదర్శన, కోచ్ రాహుల్ ద్రవిడ్ కష్టం తెలుస్తోంది. భారీ విజయంతో టోర్నీ ఆరంభించిన భారత్ భారీ విజయంతోనే ముగింపు పలికింది.
లీగ్ దశలో..
►ఆస్ట్రేలియాపై 100 పరుగులతో విజయం : టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆసీస్‌కు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని యువ బౌలర్లు 42.5 ఓవర్లలో 228 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్ తొలి భారీ విజయాన్ని నమోదు చేసింది.
►పపువా న్యూ గినియాపై 10వికెట్లతో గెలుపు : రెండో లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పసికూన పపువా న్యూ గినియాపై యువ బౌలర్లు రెచ్చిపోయారు. కేవలం 21.5 ఓవర్లే బ్యాటింగ్ చేసిన ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ 64 పరుగులకే కుప్పకూలారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 8 ఓవర్లలోనే 68 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఎంతటి భారీ విజయమంటే 10 వికెట్ల తేడాతో 252 బంతులు మిగిలుండగానే గెలుపును సొంతం చేసుకుంది.
►జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం : లీగ్ చివరిదైన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్ 48.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ వికెట్ నష్టపోకుండా కేవలం 21.4 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. దీంతో 170 బంతులు మిగిలి ఉండగానే గెలిచి మరో భారీ విజయాన్ని నమోదు చేసింది.
క్వార్టర్ ఫైనల్
►బంగ్లాదేశ్‌పై 131 పరుగులతో గెలుపు : వరుస విజయాలతో సగర్వంగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్‌కు ఇక్కడ సైతం గట్టి పోటీ ఎదురు కాలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 42.1 ఓవర్ల మేర బ్యాటింగ్ చేసి కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 131 పరుగుల భారీ తేడాతో భారీ విజయాన్నందుకుంది.
సెమీఫైనల్
►పాక్‌పై 203 పరుగులతో విజయం : సెమీస్ పోరు దాయదీ పాకిస్థాన్‌తో అనగానే భారత అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. రసవత్తర మ్యాచ్ అని అందరూ భావించగా ఈ మ్యాచ్ సైతం ఏకపక్షంగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 273 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఎలాంటి పోటీనివ్వకుండా తోక ముడిచింది. కనీసం 30 ఓవర్లు కూడా ఆడకుండా 69 పరుగులకే ఆలౌట్ అయి చిత్తుగా ఓడింది. దీంతో భారత్‌కు 203 పరుగుల భారీ విజయం సొంతమైంది.
ఫైనల్..
ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపు: ఫైనల్లో సైతం భారత్ అదరహో అనిపించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా సమిష్టిగా రాణించి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూల్చింది. అనంతం బ్యాటింగ్ చేసిన యువభారత్ సులువుగా 8 వికెట్ల తేడాతో 67 బంతులు మిగిలి ఉండగానే భారీ విజయాన్ని సొంత చేసుకోని టోర్నీ గ్రాండ్‌గా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment