ఈసారి వదలొద్దు! | Today is the Under-19 World Cup Final | Sakshi
Sakshi News home page

ఈసారి వదలొద్దు!

Published Sat, Feb 3 2018 12:49 AM | Last Updated on Sat, Feb 3 2018 4:10 AM

Today is the Under-19 World Cup Final - Sakshi

పృథ్వీ షా - జాసన్‌ సంఘా

మరొక్క విజయం...చరిత్ర పుటల్లో చోటుకు!ఇంకొక్క గెలుపు...మన సత్తా ప్రపంచానికి చాటేందుకు!ఒకే ఒక్క అడుగు...భవిష్యత్‌ తారలుగా వెలిగేందుకు!యువ భారత క్రికెట్‌ జట్టు ముంగిట 
సువర్ణావకాశం. జోరు మీదున్న కుర్రాళ్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకొక్క మ్యాచే. అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ తుది సమరం నేడే. ప్రత్యర్థి సమఉజ్జీలాంటి ఆస్ట్రేలియా. అయినా... మొగ్గు మనవైపే. అన్నిరంగాల్లో బలంగా ఉన్న పృథ్వీ షా సేన... ఆసేతు హిమాచలం ఆకాంక్షలను నెరవేరుస్తూ కప్‌ను ఒడిసిపట్టాలని దీవిద్దాం!

మౌంట్‌మాంగనీ: కుర్రాళ్ల క్రికెట్‌ సమరం తుది అంకానికి చేరింది. శనివారం ఇక్కడ జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. పటిష్ఠమైన ఈ రెండు జట్లలో ఏది గెలిచినా రికార్డు స్థాయిలో నాలుగోసారి కప్‌ను సొంతం చేసుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. మరోవైపు ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్‌లో అలవోకగా గెలుపొందింది. ఇదే ఊపు టైటిల్‌ పోరులోనూ చూపితే తిరుగుండదు. కానీ... ఆసీస్‌ వంటి జట్టు ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ప్రమాదకరమే. అయినప్పటికీ కుర్రాళ్లు ఒత్తిడిని దరి చేరనీయకుండా ఆడితే ప్రత్యర్థిని మట్టి కరిపించవచ్చు. ముఖ్యంగా 2016 అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో అనూహ్య పరాజయాన్ని గుర్తుపెట్టుకొని ఆడాలి. 

భారత్‌కు ఎదురుంటుందా? 
బ్యాటింగ్‌లో పృథ్వీ షా, మన్‌జోత్‌ కల్రా, శుభ్‌మన్‌ గిల్, బౌలింగ్‌లో కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మావి, ఇషాన్‌ పోరెల్, ఆల్‌రౌండర్‌గా అభిషేక్‌ శర్మ నైపుణ్యం, స్పిన్‌తో చుట్టేసే అనుకూల్‌ రాయ్, శివ సింగ్‌... ఇలా భారత్‌ అన్ని రంగాల్లో దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఫీల్డింగ్‌లోనూ చురుకుదనం జట్టు సొంతం. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాను 100 పరుగుల తేడాతో, సెమీస్‌లో దాయాది పాకిస్తాన్‌ను 203 పరుగులతో ఓడించడమే దీనికి నిదర్శనం. ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతున్న జట్టుకు గాయాల బెడద కూడా లేదు. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే ఫైనల్లో ద్రవిడ్‌ శిష్యులదే పైచేయి కావాలి. అయితే కలవర పెడుతున్న ఏకైక అంశం మిడిలార్డర్‌. ఇప్పటివరకు టాప్‌ ఆర్డరే అంతా చూసుకోవడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌కు సత్తా నిరూపించుకునే అవకాశం రాలేదు. తుది పోరులో అవసరానికి తగ్గట్లు రియాన్‌ పరాగ్, హార్విక్‌ దేశాయ్‌ రాణిస్తే విజయంపై ధీమాగా ఉండొచ్చు.  

ఆసీస్‌ ఎలా ఆడుతుందో? 
జాసన్‌ సంఘా నేతృత్వంలోని ఆస్ట్రేలియా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే భారత్‌ చేతిలో భంగపడినా తర్వాత కుదురుకుంది. అయితే... తుది జట్టులో స్థిరంగా కొనసాగిన, నిలకడగా ఆడిన ఆటగాళ్లు కనిపించడం లేదు. పపువా న్యూ గినియాపై ఏడు వికెట్ల ప్రదర్శన చేసిన పేసర్‌ రాల్స్‌టన్‌ తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు జట్టులోనే లేడు. మరో పేసర్‌ హ్యాడ్లీ అన్ని మ్యాచ్‌లు ఆడినా మెరుపులు మెరిపించలేదు. క్వార్టర్స్‌లో స్పిన్నర్‌ లాయిడ్‌ పోప్‌ 8 వికెట్ల ఘనత ఒక్క మ్యాచ్‌కే అన్నట్లుంది. ఇక బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు ఛేదించే సందర్భం రాలేదు. భారమంతా జాక్‌ ఎడ్వర్డ్స్‌ మోస్తున్నాడు. పపువా న్యూ గినియాపై మెక్‌ స్వీనీ చేసిన 156 పరుగులే ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌. కెప్టెన్‌ సంఘా స్థాయికి తగ్గట్లు ఆడటంలేదు. ప్రధాన బ్యాట్స్‌మన్‌ బ్రయాంట్‌ ఫామ్‌లో లేడు. పరమ్‌ ఉప్పల్‌ పర్వాలేదు. ఆస్టిన్‌ వా, విల్‌ సదర్లాండ్‌ పెద్దగా రాణించలేదు. అయితే... తమ దేశ వాతావరణానికి దాదాపు దగ్గరగా ఉండే న్యూజిలాండ్‌లో ఆడుతుండటం ఆసీస్‌కు అదనపు బలం కానుంది. కాబట్టి భారత కుర్రాళ్లు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆడాలి. 

కుర్రాళ్లూ... ద్రవిడ్‌కు కానుకివ్వండి
ప్రపంచకప్‌లో ఆడుతున్నది అండర్‌–19 జట్టయినా... వారితోపాటు వార్తల్లో నిలుస్తున్నది భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌. కోచ్‌ పాత్రలో అంతగా యువకులను ముందుండి నడిపిస్తున్నాడు ‘ది వాల్‌’. కుర్రాళ్లు కప్‌ గెలిస్తే మొదటగా అత్యంత ఎక్కువ సంతోషపడేది అతడే అనడంలో సందేహం లేదు. తానాడిన రోజుల్లో బ్యాట్స్‌మన్‌గా, జట్టు మనిషిగా ఎంతో బాధ్యతను మోసిన ద్రవిడ్‌కు ప్రపంచకప్‌ సాధించలేకపోవడం పెద్ద లోటుగా ఉండేది. 2003లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సభ్యుడైనప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో కల నెరవేరలేదు. ఇక విండీస్‌లో జరిగిన 2007 వరల్డ్‌కప్‌ అయితే ద్రవిడ్‌కు కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా పీడకలే. అతడి సారథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన జట్టు తొలి దశలోనే వెనుదిరిగింది. దీంతో ‘ది వాల్‌’... కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. తమ గురువుకు మానసికంగా వ్యథ మిగిల్చిన ఈ అనుభవాలను సంపూర్తిగా చెరిపేసే అవకాశం తాజాగా కుర్రాళ్ల ముందుంది. 2003లో సీనియర్స్‌ కప్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియాపైనే ఇప్పుడు విజయం సాధిస్తే అది ద్రవిడ్‌కు బోనస్‌ ఆనందాన్నిస్తుంది. కీలక సమరానికి ముందు కుర్రాళ్లు ఏకాగ్రత కోల్పోకుండా ఉండేందుకు ద్రవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆటగాళ్లెవరూ ఫైనల్‌ ముగిసేదాకా సెల్‌ఫోన్‌ల జోలికి వెళ్లొద్దని ఆదేశించాడు. 

పేసర్లే మా బలం 
మా పేస్‌ త్రయం టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించింది. ఫైనల్లోనూ వారే మా బలం. వారి ఫిట్‌నెస్‌ అద్భుతం. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీశారు. వారి కారణంగా జట్టులో మంచి దృక్పథం ఏర్పడింది. మంచి ఆరంభం లభిస్తే మేం 250 నుంచి 300 వరకు చేయగలం. లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఆస్ట్రేలియా మెరుగైంది. మా ప్రణాళికల ప్రకారం ఆడితే గెలుపు కష్టమేం కాదు.      
–పృథ్వీ షా, భారత జట్టు కెప్టెన్‌ 

భారత్‌కు అభిమానుల దన్ను 
మౌంట్‌మాంగనీ ప్రాంతంలో భారత్‌ నుంచి వలస వెళ్లిన సిక్కు కుటుంబాలు అధికం. ఇక్కడ వారి జనాభా 4 వేల వరకు ఉంటుంది. ఫైనల్లో వీరిలో ఎక్కువమంది భారత్‌కు మద్దతుగా స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది. స్టేడియం సామర్థ్యం 8 వేలు. 

జట్లు (అంచనా) 
భారత్‌: పృథ్వీ షా (కెప్టెన్‌), మన్‌జోత్‌ కల్రా, శుభ్‌మన్‌ గిల్, హార్విక్‌ దేశాయ్, రియాన్‌ పరాగ్, అభిషేక్‌ శర్మ, అనుకూల్‌ రాయ్, కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మావి, ఇషాన్‌ పోరెల్, శివసింగ్‌. 
ఆస్ట్రేలియా: జాసన్‌ సంఘా (కెప్టెన్‌), జాక్‌ ఎడ్వర్డ్స్, మ్యాక్స్‌ బ్రయాంట్, పరమ్‌ ఉప్పల్, మెక్‌ స్వీనీ, జొనాథన్‌ మెర్లో, విల్‌ సదర్లాండ్, బాక్ట్స్‌ర్‌ హోల్ట్, జాక్‌ ఎవాన్స్, ర్యాన్‌ హ్యాడ్లీ, పోప్‌. 

పిచ్‌
మ్యాచ్‌ జరిగే బే ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పిచ్‌పై తొలి మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాపైనే 328 పరుగులు చేసింది. 

వాతావరణం
వాతావరణంపై కొంత అనిశ్చితి నెలకొంది. శుక్రవారం భారీగా ఎండ కాసినా, శనివారం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. రెండు రోజులుగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచుతున్నారు.
ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది.

టైటిల్‌ పోరుకు చేరాయిలా...
భారత్‌  లీగ్‌ దశలో... 
►ఆస్ట్రేలియాపై 100 పరుగులతో విజయం 
►పపువా న్యూ గినియాపై 10వికెట్లతో గెలుపు 
►జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం 

క్వార్టర్‌ ఫైనల్‌ 
►బంగ్లాదేశ్‌పై 131 పరుగులతో గెలుపు 
సెమీఫైనల్‌ 
►పాక్‌పై 203 పరుగులతో విజయం 

ఆస్ట్రేలియా  లీగ్‌ దశలో 
►భారత్‌ చేతిలో 100 పరుగుల తేడాతో ఓటమి
►జింబాబ్వేపై 7 వికెట్లతో విజయం 
►పపువా న్యూ గినియాపై  311 పరుగుల తేడాతో గెలుపు 

క్వార్టర్‌ ఫైనల్‌ 
►ఇంగ్లండ్‌పై 31 పరుగులతో విజయం 
సెమీఫైనల్‌ 
►అఫ్గానిస్తాన్‌పై 6 వికెట్లతో గెలుపు 

► ఉదయం గం 6.15 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement