పాకిస్తాన్‌ను పసికూన చేశారు. వారి బౌలింగ్‌లో పసలేదనేలా బాదేశారు. తర్వాత పేస్‌తో బెంబేలెత్తించారు. దాయాదికి అవకాశమే లేకుండా కుప్పకూల్చారు. మొత్తం మీద భారత కుర్రాళ్లు చిరకాల ప్రత్యర్థిని కలసికట్టుగా కుమ్మేశారు. అండర్–19 ప్రపంచకప్‌లో సగర్వంగా, అజేయంగా అంతిమ సమరానికి అర్హత సాధించారు.
క్రైస్ట్‌చర్చ్: అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయించిన భారత యువ జట్టు అండర్–19 క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై టీమిండియా 203 పరుగులతో ఘనవిజయం సాధించింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ (94 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ శతకానికి తోడు కెప్టెన్ పృథ్వీ షా (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్); ఓపెనర్ మన్‌జోత్ కల్రా (59 బంతుల్లో 47; 7 ఫోర్లు); చివర్లో అనుకూల్ రాయ్ (45 బంతుల్లో 33; 4 ఫోర్లు) సమయోచిత ఆటతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అర్షద్ ఇక్బాల్ (3/51), మూసా (4/67) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత పేసర్ ఇషాన్ పొరెల్ (4/17) దారుణంగా దెబ్బతీశాడు. అతని ధాటికి ప్రత్యర్థి 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇవన్నీ ఇషాన్‌కే దక్కాయి. స్పిన్నర్ శివ సింగ్ (2/20), ఆల్‌రౌండర్ పరాగ్ (2/6) కూడా ఓ చేయి వేయడంతో పాక్ 29.3 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. గిల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.
భళా... శుభ్‌మన్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు పృథ్వీ షా, కల్రా చక్కటి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరు 89 పరుగులు జోడించారు. అసలు హైలైట్ మాత్రం శుభ్‌మన్ ఇన్నింగ్సే. జట్టు స్కోరు 94 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన గిల్ ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా ధీమాగా ఆడి జట్టును నిలబెట్టాడు. పోరాడే స్కోరు అందించాడు. రెండు క్యాచ్‌లతో పాటు రనౌట్ అవకాశం చేజార్చిన పాక్ పేలవ ఫీల్డింగ్ కూడా అతడికి కలిసొచ్చింది. అయినప్పటికీ... గిల్ ఆటను తక్కువ చేయలేం. మంచి క్రికెటింగ్ షాట్లు కొట్టిన అతడు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శతకం పూర్తిచేసుకున్నాడు. 273 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయారు.
►6 అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో 2000, 2008, 2012లలో భారత్ విజేతగా నిలిచింది. 2006, 2016 ఫైనల్స్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment