
రవితేజ, విహారి
హైదరాబాద్ 341/4
జమ్మూకాశ్మీర్‌తో రంజీ మ్యాచ్
జమ్మూ: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రవితేజ (217 బంతుల్లో 153 బ్యాటింగ్, 17 ఫోర్లు, 2 సిక్సర్లు), హనుమ విహారి (164 బంతుల్లో 109, 18 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కావడంతో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ఒక్క రోజులోనే నిర్ణీత ఓవర్లు (90) కూడా పూర్తిగా ఆడకుండానే 300 పైచిలుకు పరుగులు చేయడం విశేషం. రవితేజ, విహారి వన్డేను తలపించేలా వీరవిహారం చేశారు.
ఈ సీజన్‌లో చక్కని ఫామ్‌లో ఉన్న వీరిద్దరు ఈ మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరు 203 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (9) విఫలమయ్యాడు. దీంతో జట్టు 22 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (49) అర్ధసెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయినా... రవితేజతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. జమ్మూకాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా హైదరాబాద్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. సమీవుల్లా బేగ్, రామ్‌దయాళ్ పూనియా, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవితేజతో పాటు అమోల్ షిండే (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: సుమన్ (సి) ఒబేద్ హరూన్ (బి) సమీవుల్లా బేగ్ 9; అక్షత్ రెడ్డి రనౌట్ 49; రవితేజ బ్యాటింగ్ 153; విహారి (స్టంప్డ్) హరూన్ (బి) బందీప్ సింగ్ 109; ఖాద్రీ ఎల్బీడబ్ల్యూ (బి) రామ్‌దయాళ్ 8; షిండే బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 341.
వికెట్ల పతనం: 1-22, 2-109, 3-312, 4-337
బౌలింగ్: సమీవుల్లా 16-0-97-1, మహ్మద్ గుజ్రీ 16-3-48-0, రామ్‌దయాళ్ 15-3-51-1, ఉమర్ నజీర్ 11-1-39-0, పర్వేజ్ రసూల్ 14-3-54-0, రిషీ 3-1-10-0, బందీప్ సింగ్ 8-2-24-1, మంజూర్‌దార్ 1-0-10-0.