పట్టు బిగించిన మహారాష్ట్ర
ఇండోర్: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ సెమీఫైనల్లో మహారాష్ట్ర జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంగ్రామ్ అతిట్కార్ (228 బంతుల్లో 168; 29 ఫోర్లు) సెంచరీ సహాయంతో తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 126.3 ఓవర్లలో 455 పరుగుల స్కోరు సాధించింది.
దీంతో ప్రత్యర్థిపై 341 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా అటు బౌలర్లు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అంకిత్ బానే (208 బంతుల్లో 89; 14 ఫోర్లు; 1 సిక్స్) సంక్లేచ (72 బంతుల్లో 52; 4 ఫోర్లు; 4 సిక్స్) తమ వంతు సహకారం అందించారు. దిండా, శుక్లాలకు మూడు, సర్కార్, పాల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో ఆరిందమ్ దాస్ (7 బ్యాటింగ్) ఉన్నాడు.
పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 270
మొహాలీ: కర్ణాటకతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో పంజాబ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 64.5 ఓవర్లలో 270 పరుగులు చేసింది. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా రెండో రోజు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు పేసర్ వినయ్ కుమార్ (5/27) ధాటికి కోలుకోలేక పోయింది. యువరాజ్ సింగ్ (56 బంతుల్లో 42; 4 ఫోర్లు; 2 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక 22.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.