ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మాటే చెల్లుబాటు అయ్యింది. అంతా ఊహించినట్టుగానే టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరోసారి ఎంపికయ్యాడు. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు రవిశాస్త్రి నియామకాన్ని ధ్రువీకరిస్తూ కపిల్‌దేవ్ ప్రకటన విడుదల చేశాడు. కాగా టీమిండియా కోచ్ ఎంపికకు శుక్రవారం ఇంటర్వ్యూలు జరిగిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో కోచ్ పదవి రేసులో ఉన్న ఫిల్ సిమ్మన్స్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. ఇక మిగిలిన ఐదుగురిలో రవిశాస్త్రి వైపే బీసీసీఐ మరోసారి మొగ్గుచూపింది. కోచ్‌గా అతడినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక కెప్టెన్ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం... అతడి శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకోవడం, పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్‌కు మంచి సంబంధాలు ఉండటంతో రవిశాస్త్రి ఎంపిక లాంఛనమే అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి మరో రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2021 వరకు ఇతడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.కాగా రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment