రవితేజ అజేయ సెంచరీ | Ravi Teja Unbeaten Century Against Delhi Match | Sakshi
Sakshi News home page

రవితేజ అజేయ సెంచరీ

Published Thu, Nov 22 2018 10:01 AM | Last Updated on Thu, Nov 22 2018 10:01 AM

Ravi Teja Unbeaten Century Against Delhi Match - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగుతోంది. తొలిరోజు ఆటలో తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీతో చెలరేగగా... బుధవారం టి. రవితేజ (206 బంతుల్లో 115; 9 ఫోర్లు, సిక్స్‌) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 232/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 170.3 ఓవర్లలో 460 పరుగులకు ఆలౌటైంది. రవితేజతో పాటు సీవీ మిలింద్‌ (58; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్వంత్‌ ఖెజ్రోలియా, గౌరవ్‌ కుమార్‌ చెరో 3 వికెట్లు దక్కించుకోగా, వికాస్‌ మిశ్రా 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ ఆటముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఢిల్లీ ఇంకా 439 పరుగులు వెనుకబడి ఉంది.  

ఆకట్టుకున్న రవితేజ, మిలింద్‌

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 8 పరుగులే జోడించి కుల్వంత్‌ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో కుల్వంత్‌ చెలరేగడంతో మరో ఐదు పరుగుల వ్యవధిలో వికెట్‌ కీపర్‌ సుమంత్‌ కొల్లా (2), సందీప్‌ (41; 5 ఫోర్లు) వికెట్లను హైదరాబాద్‌ కోల్పోయింది. వెంటనే తనయ్‌ త్యాగరాజన్‌ (1) సిమర్‌జీత్‌సింగ్‌కు దొరికాడు. అప్పటికి జట్టు స్కోరు 265/7. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీవీ మిలింద్‌తో కలిసి రవితేజ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్‌ను రొటేట్‌ చేశారు. ఈ క్రమంలో రవితేజ 125 బంతుల్లో , మిలింద్‌ 113 బంతుల్లో తమ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 133 పరుగులు జోడించిన తర్వాత సీవీ మిలింద్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం మెహదీ హసన్‌ (51 బంతుల్లో 14; 3 ఫోర్లు) సహకారంతో రవితేజ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అర్ధసెంచరీ తర్వాత దూకుడు పెంచిన రవితేజ కేవలం 57 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాక హిమ్మత్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి మెహదీ హసన్‌ ఔటయ్యాడు. రవితేజ ధాటిగా ఆడుతున్నప్పటికీ రవికిరణ్‌ (0) ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 460 పరుగులకు ముగిసింది.  

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (బి) కుల్వంత్‌ 120; అక్షత్‌ రెడ్డి (సి) గౌరవ్‌ (బి) వికాస్‌ 15; రోహిత్‌ రాయుడు (సి) ధ్రువ్‌ (బి) వికాస్‌ 10; హిమాలయ్‌ అగర్వాల్‌ (సి) సార్థక్‌ (బి) గౌరవ్‌ 66; సందీప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్వంత్‌ 41; సుమంత్‌ (సి) ధ్రువ్‌ (బి) కుల్వంత్‌ 2; రవితేజ (నాటౌట్‌) 115; తనయ్‌ (సి) గౌరవ్‌ (బి) సిమర్‌జీత్‌ 1; మిలింద్‌ (రనౌట్‌) 58; మెహదీ హసన్‌ (సి) హిమ్మత్‌ సింగ్‌ (బి) గౌరవ్‌ 14; రవికిరణ్‌ (బి) గౌరవ్‌ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (170.3 ఓవర్లలో ఆలౌట్‌) 460.

వికెట్ల పతనం: 1–30, 2–52, 3–188, 4–255, 5–259, 6–260, 7–265, 8–398, 9–444, 10–460.  
బౌలింగ్‌: కుల్వంత్‌ 27–7–64–3, గౌరవ్‌ 22.3–7–50–3, సిమర్‌జీత్‌ 29–6–94–1, వికాస్‌ 49–6–107–2, లలిత్‌ 26–2–72–0, నితీశ్‌ రాణా 11–1–34–0, హితేన్‌ 1–0–9–0, ధ్రువ్‌  షోరే 5–0–18–0.  
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌: సార్థక్‌ (బ్యాటింగ్‌) 6; హితేన్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 21.
బౌలింగ్‌: రవికిరణ్‌ 3–0–12–0, సీవీ మిలింద్‌ 3–0–9–0, తనయ్‌ 1–1–0–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement