రాయుడు, హర్భజన్ సింగ్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : టీమిండియా ఆటగాళ్లు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ఐపీఎల్ ఆరంభం నుంచి 2017 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడి ఆ జట్టు మూడు సార్లు టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ తాజా సీజన్‌లో సైతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగారు. ఈ సీజన్‌లో వీరిని చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలుచేసింది. చెన్నై టైటిల్ నెగ్గడంలో ఈ ఇద్దరు తమవంతు పాత్ర పోషించారు.
అయితే ఈ ఇద్దరి ఆటగాళ్లు 2016 సీజన్‌లో మైదానంలో ఒకరినొకరు దూషించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు గొడవపడటం చాలా అరుదు. కానీ రైజింగ్ పుణెతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ భజ్జీ రాయుడిపై గట్టిగా అరిచాడు. దీనికి రాయుడు తిరగబడటంతో వెనక్కి తగ్గిన భజ్జీ క్షమాపణలు కోరాడు. అయినా రాయుడు శాంతించకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ వాగ్వాదంపై తాజాగా ‘భజ్జీ బ్లాస్ట్ విత్ సీఎస్‌కే షో’లో ఈ స్టార్ క్రికెటర్లు స్పందించారు. ముందుగా ఈ ఘటనను గుర్తు చేసుకున్న రాయుడు ఈ విషయంలో భజ్జీని ఎన్నోసార్లు క్షమాపణలు కోరానన్నాడు. అసలు ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించానో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
భజ్జీ మాట్లాడుతూ.. ‘నేను ఎంతోమందితో కొట్లాడాను, కానీ ఎవరు నాకు ఎదురు తిరగలేదు. రాయుడొక్కడే నాతో గొడవపడ్డాడు. మైదానంలో ఇలాంటివి సహజమే. నేను సైతం ఎంతోమంది సీనియర్లతో గొడవపడ్డాను. ఆ సమయంలో క్షమాపణలు తెలియజేస్తే సమస్య ఉండదు.’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రాయుడు క్షమాపణలు చేప్పాల్సిన పనిలేదన్నాడు. ఐపీఎల్‌లో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మతో కలిసి ఈ ఇద్దరు ఆటగాళ్లు రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment