డివిలియర్స్, డికాక్
బెంగళూరు : చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికా ద్వయం డివిలియర్స్(68), డికాక్(53)లు దంచికొట్టారు. ఈ వీరవిహారానికి చివర్లో మన్‌దీప్(32) తోడవ్వడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. కెప్టెన్ విరాట్ కోహ్లి (18) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఐదో ఓవర్ వేసిన ఠాకుర్ కోహ్లి వికెట్ తీయడమే కాకుండా ఈ ఓవర్‌ను మెయిడిన్ చేయడం విశేషం.
100 పరుగుల భాగస్వామ్యం
కోహ్లి వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మరో ఓపెనర్ డికాక్‌తో చెలరేగాడు. సిక్స్‌లు, ఫోర్లతో ఈ దక్షిణాఫ్రికా ద్వయం స్టేడియాన్ని హోరెత్తించింది. 35 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్ సాయంతో డికాక్ తొలుత హాఫ్ సెంచరీ సాధించగా.. మరి కొద్ది సేపటికే 23 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో ఏబీ సైతం అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం మరింత రెచ్చి పోయిన ఈ సఫారీ ద్వయం చెన్నై బౌలర్లకు సింహ స్వప్నంలా మారారు. ఇక శార్ధుల్ వేసిన 13 ఓవర్‌లో ఏబీ ఏకంగా మూడు వరుస సిక్సులతో 20 పరుగులు పిండుకున్నాడు. ఆ వెంటనే బౌలింగ్‌కు దిగిన డ్వేన్ బ్రేవో అద్భుత బంతికి డికాక్ 53(37 బంతుల్లో 1 ఫోర్,4 సిక్స్‌లు) రిట్నర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే బ్రేవో వికెట్ పడగొట్టడమే కాకుండా ఓవర్‌ను మెయిడిన్ చేయడం విశేషం.
చివర్లో తడబాటు
వేగంగా ఆడే క్రమంలో డివిలియర్స్ 68(30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగగా.. మరుసటి బంతికే అండర్సన్(2) పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మన్‌దీప్, గ్రాండ్ హోమ్‌లు వేగంగా పరుగులు చేశారు. జట్టు స్కోర్ 191 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించిన మన్‌దీప్ 32(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోర్ నమోదు చేస్తుందనుకున్న ఆర్సీబీ గ్రాండ్ హోమ్(11), పవన్ నేగి(1), ఉమేశ్ యాదవ్(0) వికెట్లు కోల్పోయింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ సిక్సు, ఫోర్‌తో రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో బ్రేవో, తాహీర్, ఠాకుర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment