అదే నాకు పెద్ద అవకాశం:శరణ్
హరారే:జింబాబ్వే పర్యటన ద్వారా అటు వన్డేల్లో, ఇటు టీ 20ల్లో ఒకేసారి అరంగేట్రం చేయడమే తనకు లభించిన పెద్ద అవకాశమని టీమిండియా పేసర్ బరిందర్ శరణ్ స్పష్టం చేశాడు. దీంతో పాటు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నాడు. 'ధోని సారథ్యంలో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం నాకు లభించిన గొప్ప అవకాశం. మహీ భాయ్ నాకు రెండింట్లో అవకాశం కల్పించాడు. అరంగేట్రం అద్భుతంగా ఉండాలనేది ప్రతీ ఒక్క క్రికెటర్ కల. అది తన టీ 20 ప్రదర్శన ద్వారా నెరవేరినందుకు ఒకింత గర్వంగా ఉంది'అని శరణ్ తెలిపాడు.
టీ 20ల్లో బ్యాట్స్మెన్ను తొందరగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో బౌలర్పై ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుందన్నాడు. బంతిని సరైన లెంగ్త్లో సంధించడంతో పాటు, పేస్లో కూడా వైవిధ్యం అవసరమన్నాడు. తన బౌలింగ్ మెరుగు పడ్డానికి వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్లే కారణమన్నాడు. తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం ఎలానో ఆ ఇద్దర బౌలర్ల నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో తాము అనేక విషయాలు షేర్ చేసుకున్నామని, అదే క్రమంలో వారు సీనియర్లు కావడంతో చాలా సలహాలిచ్చారని బరిందర్ తెలిపాడు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారిచ్చిన కొన్ని టిప్స్ తనకు బాగా ఉపకరిస్తున్నాయని బరిందర్ మరోసారి పునరుద్ఘాటించాడు.
జింబాబ్వేతో రెండో టీ 20లో బరిందర్ శరణ్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు సాధించడం ద్వారా శరణ్ అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. తద్వారా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రంలో నమోదు చేసిన రికార్డును సవరించాడు. ఓవరాల్ టీ 20 అరంగేట్రం రికార్డులో మెరుగైన గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ గా శరణ్ నిలిచాడు.