వార్నర్ మరో సెంచరీ
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (113 బంతుల్లో 116; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ జో బర్న్స్ (123 బంతుల్లో 129; 13 ఫోర్లు; 4 సిక్సర్లు) కూడా సెంచరీ సాధించడంతో... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 264 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌పై ఆతిథ్య జట్టు 503 పరుగుల ఆధిక్యంతో ఉంది.
ప్రస్తుతం క్రీజులో ఖవాజా (9 బ్యాటింగ్), వోజెస్ (1 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విలియమ్సన్ (178 బంతుల్లో 140; 24 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్టార్క్‌కు నాలుగు, జాన్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మూడుసార్లు ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పాంటింగ్, గవాస్కర్ ఈ ఘనత సాధించారు.