పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment