వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట | Aus Vs Pak 3rd Test Day 2: Pak Get Warner Before Lunch Rain Stops Play Score, See Highlights Inside - Sakshi
Sakshi News home page

AUS Vs PAK 3rd Test: వర్షం కారణంగా ముగిసిన రెండో రోజు ఆట.. హైలైట్స్‌

Published Thu, Jan 4 2024 12:07 PM | Last Updated on Thu, Jan 4 2024 1:27 PM

Aus Vs Pak 3rd Test Day 2: Pak Get Warner Before Lunch Rain Stops Play Score - Sakshi

లబుషేన్‌- స్టీవ్‌ స్మిత్‌ (PC: cricket.com.au X)

Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో ఆసీస్‌ పేసర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్‌ (0), అయూబ్‌ (0) డకౌట్‌ కాగా, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (35; 3 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (88), ఆగా సల్మాన్‌ (53) సల్మాన్‌ ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు.  

మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్‌ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్‌ భావించింది. కానీ పేస్‌ ఆల్‌రౌండర్‌‌ ఆమిర్‌ జమాల్‌ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా పాకిస్తాన్‌ మెరుగైన స్కోరు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు అత్యధికంగా  ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్‌ రెండు, మిచెల్‌ మార్ష్‌, నాథన్‌ లియాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ 24.3 ఓవర్‌ వద్ద ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(34) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 

అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్‌ లబుషేన్‌.. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్‌ జమాల్‌ అవుట్‌ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. స్టీవ్‌ స్మిత్‌ క్రీజులోకి వచ్చాడు.

ఈ క్రమంలో 47వ ఓవర్‌ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్‌ 23, స్టీవ్‌ స్మిత్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ఆగా సల్మాన్‌, ఆమిర్‌ జమాల్‌కు చెరో వికెట్‌ దక్కింది.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌ డేవిడ్‌ వార్నర్‌ కెరీర్‌లో చివరి టెస్టు.

చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement