కోహ్లి-సచిన్ టెండూల్కర్(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన వంద సెంచరీల రికార్డును ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అధిగమించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. నిలకడ, దూకుడు, ఫామ్ అన్నింటిలోనూ తనదైన మార్కుతో చెలరేగిపోతున్న కోహ్లి..గతంలో ఎవరూ లేనంతగా స్థిరంగా రాణిస్తున్నాడన్నాడు.
'కోహ్లి తరుచూ సెంచరీలు కొడుతున్నాడు. సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోహ్లికి పుష్కలంగా ఉంది. రికార్డులు ఉన్నది బ్రేక్ చేయడానికి కదా. ఈ ఘనత కోహ్లి సాధిస్తే నేనెంతో సంతోషిస్తా. సచిన్ కూడా తప్పకుండా ఆనంద పడతాడు. అయితే విరాట్ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది. కోహ్లిని ఎవరితో పోల్చడం నాకిష్టం లేదు' అని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇటీవల విరాట్ నేతృత్వంలో సాధించిన విజయాల్లో ఉప ఖండంలోనే ఎక్కువగా ఉన్నాయన్న విశ్వనాథ్.. టీమిండియా తన దక్షిణాఫ్రికా పర్యటనలో అమోఘంగా రాణిస్తుందన్నాడు. ఇదే విజయపరంపర మిగతా దేశాల్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment