‘రియో’ నా చివరి ఒలింపిక్స్: బోల్ట్
కింగ్‌స్టన్: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ తన కెరీర్‌లో చివరి ఒలింపిక్స్ అని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ధ్రువీకరించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ బరిలోకి దిగే అవకాశముందని అతని కోచ్ గ్లెన్ మిల్స్ ఇటీవలే వ్యాఖ్యానించారు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మూడేసి స్వర్ణాలు సాధించిన బోల్ట్ ఇదే ఫలితాన్ని రియో ఒలింపిక్స్‌లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
‘రియో ఒలింపిక్స్‌లోనూ మూడు స్వర్ణాలు సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఒకవేళ రియోలో నా లక్ష్యం నెరవేరితే మరో నాలుగేళ్లపాటు ఇదే ఉత్సాహంతో కొనసాగడం చాలా కష్టం. అందుకే నా కెరీర్‌లో రియోవే చివరి ఒలింపిక్స్ క్రీడలు కానున్నాయి’ అని బోల్ట్ స్పష్టం చేశాడు.