రియోలో పరుగుల చిరుత
రియోడిజనీరో: వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బ్రెజిల్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి వారం రోజుల ముందే రియోడిజనీరోకి రావడం పరుగుల వీరుడి అంకిత భావానికి నిదర్శనం. వరుసగా మూడు ఒలింపిక్స్ లో 100, 200, 4x100 విభాగాలలో స్వర్ణాలు సాధించిన తొలి అథ్లెట్ గా రికార్డు నెలకొల్పేందుకు బోల్ట్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు.
బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో మూడు విభాగాలలో స్వర్ణాలు సాధించాడు బోల్ట్. గత శుక్రవారం 200 మీటర్ల రేస్ ను 19.89 సెకన్లలో పూర్తిచేసి తన ఫిట్ నెస్ మరోసారి నిరూపించుకున్నాడు. ఉసేన్ బోల్ట్ మ్యునిక్ లో ఒలింపిక్స్ కోసం శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ట్రయల్స్‌లో పాల్గొనకున్నా జమైకా దేశం బోల్ట్ ఎంట్రీని రియో ఒలింపిక్స్‌కు పంపించింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పరుగుతోనే బదులివ్వాలని బోల్ట్ భావిస్తున్నాడు. మరోవైపు రికార్డు స్వర్ణాలపై కన్నేసిన బోల్ట్, రియోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.