పుణే బౌలర్లు గెలి(పిం)చారు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సొంత మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తడ'బ్యాటు'తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఆర్సీబీపై 27 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ విజయం సాధించింది. పుణే బౌలర్లు రాణించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పుణే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణెకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అజింక్యా రహానే(30; 25 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(31; 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్), కెప్టెన్ స్టీవ్ స్మిత్(27; 24 బంతుల్లో3 ఫోర్లు), ఎంఎస్ ధోని(28; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు ఓ మోస్తరుగా రాణించారు. మనోజ్ తివారీ 11 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లతో 27 పరుగులు సాధించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది
162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్ మన్‌దీప్ సింగ్ రెండో ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(28; 19 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్(29; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. స్టోక్స్ బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ గా కోహ్లీ ఔటయ్యాడు. తాహిర్ బౌలింగ్ లో క్రీజు వదిలి ముందుకు వచ్చిన డివిలియర్స్.. ధోనీ అద్బుత స్టంప్‌తో నిరాశగా వెనుదిరిగాడు. ఆ పై వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది.
వాట్సన్(14), జాదవ్(18), స్టూవర్ట్ బిన్నీ(18; 8 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) షాట్లు ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యారు. పుణే బౌలర్లు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకు పరిమితమైంది. దీంతో 27 పరుగులతో పుణే మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పుణే బౌలర్లలో స్టోక్స్, ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా, తాహిర్ కు ఒక వికెట్ దక్కింది.