దారుణ వైఫల్యాలపై స్పందించిన క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో అత్యంత దారుణ ప్రదర్శన ఇచ్చిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). గతేడాది ఫైనల్స్ చేరిన జట్టేనా ఇప్పుడు మనం చూస్తున్నది అన్నట్లుగా ఘోరంగా విఫలమై కేవలం మూడు విజయాలతో ఓవరాల్‌గా 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆర్సీబీ దారుణ వైఫల్యంపై ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఎట్టకేలకే స్పందించాడు. 'వరుస ఓటములతో పూర్తిగా నిరాశచెందాం. ఈ సీజన్ మాకు పాఠం నేర్పించింది. వైఫల్యాలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం.
జట్టులో లోపాలు తెలుసుకున్నా ఆర్సీబీ సమిష్టిగా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఇంకా చెప్పాలంటే బౌలర్లు, బ్యాట్స్‌మెన్లలో ఏ ఒక్కరూ రాణించకపోవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది. అలాంటి సమయాలలో సమష్టిగా గేమ్ ప్లాన్ చేసుకుని ఆడాలి. అప్పుడు విజయాల బాట పట్టేవాళ్లం. కానీ ఆర్సీబీ అలా చేయకపోవడంతో చివరికి అట్టడుగున నిలవాల్సి వచ్చింది. వచ్చే సీజన్లో మంచి ప్రదర్శన చేస్తామని' గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తమ చివరి మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ పై నెగ్గి విజయంతో సీజన్‌ను ముగించింది ఆర్సీబీ. క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ స్టార్ ప్లేయర్స్ ఉన్న జట్టు ఓ మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసింది.